Saturday November 17, 2018
పైసా వసూల్ సినిమా రివ్యూ - Tollybeats

పైసా వసూల్ సినిమా రివ్యూ

Updated | September 1, 2017 17:40 IST

టైటిల్: పైసా వసూల్
జానర్: సోషల్ యాక్షన్ డ్రామా
నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శ్రియాశరన్, ముస్కాన్, కైరా దత్, కబీర్ బేడి, విక్రమ్ జీత్, కృష్ణస్వామి శ్రీకాంత్, పృథ్వీరాజ్, అలీ తదితరులు
సినిమాటోగ్రఫీ: ముఖేష్.జి
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
నిర్మాత: వి.ఆనంద ప్రసాద్
కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్
విడుదల: 01-09-2017
రేటింగ్: 3 / 5

తెలుగు చిత్ర సీమలో ఎన్‌టిఆర్‌ తర్వాత సాంఘిక, జానపద, చారిత్రక, పౌరాణిక, సోషియో ఫాంటసీ తో సహా దాదాపు అన్ని రకాల జానర్‌లో నటించిన ఒకే ఒక్క నటుడు నందమూరి బాలకృష్ణ. పెద్దాయన ఎన్‌టిఆర్‌ నటించని పాత్ర అంటూ లేదని అనుకుంటున్న వేళ ఆయన నటించని పాత్ర ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ని తన వందవ చిత్రంగా నటించి మెప్పించిన నట వారసుడు బాలయ్య. అలాంటి బాలయ్య, ‘చంటిగాడు.. లోకల్‌’ తరహా నేటితరం మాస్‌పాత్రలకు సృష్టికర్త అయిన పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తే ఎలా ఉంటుంది? అదే ‘పైసా వసూల్‌’. భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచవ్యాపితంగా విడుదలయిన ఈ చిత్రం, కొంతకాలంగా హిట్లకు దూరంగా ఉన్న పూరికి ఊరట నిచ్చిందా? పూరి స్టైల్‌ హీరోగా బాలయ్య అభిమానులను ఎలా అలరించాడు? అనేది చూద్దాం.

కథేంటంటే?: పోర్చుగల్‌లో ఉండి ఇండియాలో విధ్వంసాలకు పాల్పడే  బాబ్‌మార్లే (విక్రమ్‌జీత్‌) అనే ఇంటర్నేషనల్‌ మాఫియాడాన్‌ కోసం భారత పోలీసులు.. ముఖ్యంగా  ‘రా’ అధికారులు  వెతుకుతుంటారు. అయితే అతడికి ఇక్కడి నాయకుల అండ ఉంటుంది. బాబ్‌ మార్లేను అంతం చేయడానికి ప్రైవేట్‌ వ్యక్తినైనా నియమించాలనుకొంటాడు  రా ఆఫీసర్‌ (కబీర్‌ బేడీ). ఇదిలావుండగా, తీహార్‌ జైలు నుంచి హైదాబాద్‌ వచ్చిన తేడా సింగ్‌ (బాలకృష్ణ) ఎవరినీ లెక్కచేయని రికామి. అతనుండే ఏరియాలో హారిక (ముస్కాన్‌), పని మీద పోర్చుగల్‌ వెళ్లి కనపడకుండా పోయిన తన అక్క సారిక(శ్రియ) గురించి పోలీసులను ఆరా తీస్తుంటుంది. హారికను ప్రేమ పేరుతో వెంబడిస్తుండే తేడా సింగ్‌,  ఇక్కడి గ్యాంగ్‌స్టర్‌తో ఘర్షణ పడుతూ.. ఆపై స్నేహం చేస్తుంటాడు.  ఇతని గట్స్‌, యాటిట్యూడ్‌ నచ్చి, బాబ్‌మార్లేని చంపే డీల్‌ను ఇతనికి ఇస్తుంది స్థానిక ఎసిపి కిరణ్మయి (కైరా దత్‌). ఈ క్రమంలో ఒక సెంట్రల్‌ మినిస్టర్‌ (కృష్ణస్వామి శ్రీకాంత్‌ ),  తేడా సింగ్‌ గురించి తెలుసుకుని, అతన్ని చంపేయమని లోకల్‌ గ్యాంగ్‌స్టర్‌కు ఆదేశాలిస్తాడు. దీంతో వారు తేడాసింగ్‌ను రప్పించడం కోసం హారికను కిడ్నాప్‌ చేస్తారు. వారందరినీ చంపి తేడాసింగ్‌ హారికను రక్షిస్తే, హారిక మాత్రం అతడిని పిస్టల్‌తో కాలుస్తుంది. తేడా సింగ్‌ ను మినిస్టర్‌ ఎందుకు చంపించాలనుకున్నాడు?  అతడిని హారిక ఎందుకు కాల్చింది? పోలీసులతో కుదుర్చుకున్న డీల్‌ ప్రకారం తేడా సింగ్‌, బాబ్‌మార్లేని చంపాడా? అనేవి తెరపై చూడాల్సిందే!

ఎలా ఉందంటే?: తనవే అయిన కొన్ని గత చిత్రాల తరహాలోనే ఇంటర్‌నేషనల్‌ డాన్‌ను ఇండియన్‌ పోలీసులు వేటాడే తరహా కథను మరి కాస్త ట్విస్టీగా అల్లుకుని, బాలకృష్ణ అభిమానులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన చిత్రం పైసా వసూల్‌. కథ గురించి పెద్దగా చెప్పుకునేది లేదు కానీ, బాలకృష్ణ పాత్రను డిజైన్‌ చేసుకున్న తీరు, రాసుకున్న సీన్‌లు, యాక్షన్‌ ఎపిసోడ్లు, డైలాగులు,  వాటిని పలికించిన తీరు నూరుశాతం అభిమానులను అలరిస్తాయి. తేడాసింగ్‌ పాత్రలోని యాటిట్యూడ్‌, వేరియేషన్స్‌ అన్నీ అభిమానులకు నచ్చుతాయి.  బాలయ్య కనిపించని సీన్‌ దాదాపు లేదు. పైగా బాలయ్య కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌ అవుతారు. భారీ డైలాగులు కాకుండా చిన్న డైలాగులతో చమక్కు రేపాడు బాలుయ్య. గత సినిమా బాడీలాంగ్వేజ్‌కి ఈ సినిమా బాడీ లాంగ్వేజ్‌కి చాలా తేడా ఉండి, కచ్చితంగా ఈ సినిమాలో కొత్త బాలయ్యను చూస్తారు.  తేడాసింగ్‌ పాత్రను ‘బా’ గా ఎమ్యాట్‌ చేసి, ఎలివేట్‌ చేసిన సీన్‌ బాగుంటుంది. పూరి మాటల పదును అక్కడక్కడా వినిపిస్తుంది.  క్లైమాక్స్‌ కు ముందు.. తదుపరి ప్రపంచయుద్ధం, దేశభక్తి గురించి చెప్పించిన డైలాగులు బాగున్నాయి. ‘నన్ను కాల్చాలంటే  నా బంధువులైనా అయి ఉండాలి.. అభిమానులైనా అయి ఉండాలి’, ‘సింహానికి మేక ఎరేయాలను కోవడం కరక్టే కానీ ఆ ప్లాన్‌ని మేకలన్నీ కలిపి చేయడమే ఫన్నీగా ఉంది’.. వంటి మాస్‌ డైలాగులు అభిమానులను అలరిస్తాయి. సినిమాలో ప్రత్యేకంగా కామెడీ లేదు కానీ బాలయ్య హావభావాలు, డైలాగులు విరుపుల్లోనే హాస్యాన్నీ రాబట్టాడు పూరి.  ‘మావా ఏక్‌ పెగ్‌ లా’, ఎన్‌టిఆర్‌ సాంగ్‌ రీమిక్స్‌ ‘కంటి చూపు చెపుతోంది’  తో సహా అన్ని పాటల చిత్రీకరణ బాగుంది. పాటల్లో స్టెప్పులు, యాక్షన్‌లో ఫైట్లు కూడా కొత్తగా ఉండేలా చూసుకున్నాడు. అయితే కథ, కథనాలు పూరి గత చిత్రాలను గుర్తుతెస్తాయి. అనేక లాజిక్కులూ మిస్సయ్యాయి. కాగా,  కెమెరా, ఎడిటింగ్‌, సంగీతం అన్నీ బాగా కుదిరాయి. భవ్య క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. మాస్‌ ప్రేక్షకులను, బాలకృష్ణ అభిమానులను అలరించే పూరి మార్క్‌ బాలయ్య చిత్రం పైసా వసూల్‌.

ఎవరెలా చేశారంటే:  బాలయ్యలోని సరికొత్త నటుడిని  ఒన్‌మేన్‌ షో గా ఆవిష్కరించిన చిత్రం ఇది. ఇందులో బాలకృష్ణ డైలాగ్‌ డెలివరీ తో పాటు తను పాడిన పాటా హైలెట్‌. ముగ్గురు హీరోయిన్లు ఉన్నా  ప్రాధాన్యం ఉన్న పాత్ర లో శ్రియ తన సీనియారిటీని చూపించగలిగింది. కైరా దత్‌ ఐటమ్‌ సాంగ్‌లో కనిపించడంతో పాటు ఆసక్తికరమైన పాత్రలో మెప్పించింది. ముస్కాన్‌ ఫరావాలేదు. విలన్‌లుగా విక్రమ్‌జీత్‌, కృష్ణస్వామి శ్రీకాంత్‌ లు పరిధి మేరకు నటించారు. సీనియర్‌ ఆర్టిస్ట్‌ కబీర్‌బేడీ ఓ ముఖ్య పాత్రలో కనిపించి, ఆకట్టుకుంటారు. పవిత్రా లోకేష్‌, ఫృద్విరాజ్‌, అలీ వంటి మిగిలిన వారు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. 

బలాలు: బాలకృష్ణ పాత్ర, నటన, డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు
బలహీనతలు: కొత్త కథ కాకపోవడం, అక్కడక్కడా లాజిక్కు మిస్సవడం
ముక్తాయింపు: ఇందులో తేడా సింగ్ చెప్పినట్లు.. ఫ్యామిలీస్కి ఓకె.. ఫ్యాన్స్కి డబుల్ ఓకె

SHARE