Friday September 21, 2018
హెచ్1బిపై అమెరికా స్పష్టీకరణ - Tollybeats

హెచ్1బిపై అమెరికా స్పష్టీకరణ

Updated | January 10, 2018 17:41 IST

వాషింగ్టన్‌: భారతీయ టెకీలకు పెద్ద ఉపశమనం. హెచ్‌1బి వీసా గడువు పొడిగింపు ఉండదంటూ కొద్ది రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ప్రతిపాదనపై అమెరికా స్పష్టతనిచ్చింది. అటువంటి ప్రతిపాదననను పరిశీలించడం లేదని అమెరికా పౌరసత్వ, వలసల సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌)కు చెందిన ఒక అధికారి చెప్పారు.

‘‘హెచ్‌1బి వీసాదారులు బలవంతంగా అమెరికా నుంచి వెళ్లిపోయేలా చేసేలా సంబంధిత చట్టంలో నిబంధనను మార్చాలని యూఎస్‌సీఐఎస్‌ అనుకోవడం లేదు. హెచ్‌1బి వీసాల గడువును పొడిగించడానికి అవకాశం కల్పించే ‘21వ శతాబ్దంలో అమెరికా పోటీతత్వం చట్టం (ఏసీ21)’లోని సెక్షన్‌ 104సికి భాష్యం మార్చాలనుకోవడం లేదు.’’ అని యూఎస్‌సీఐఎస్‌ మీడియా సంబంధాల ప్రధాన అధికారి జోనాథన్‌ విథింగ్టన్‌ చెప్పారు. సంబంధిత సెక్షన్‌ ప్రకారం.. హెచ్‌1బి వీసాలకు ఆరేళ్ల పరిమితికి మించి గడువును పెంచుకోవడానికి వీలవుతుంది. ఈ వీసాలకు సంబంధించి యూఎస్‌సీఐఎస్‌ తన విధానాన్ని ఒత్తిడి కారణంగా మార్చుకుంది అన్న వాదన పూర్తిగా తప్పు అని జోనాథన్‌ స్పష్టం చేశారు.

హెచ్‌1బి వీసా నిబంధనలను ట్రంప్‌ ప్రభుత్వం కఠినతరం చేయాలని అనుకుంటోందని, ఫలితంగా జీవిత భాగస్వాములు, పిల్లలతో కలిపి మొత్తం 15లక్షల మంది భారతీయులు స్వదేశానికి వెళ్లిపోవాల్సి వస్తుందని కొద్ది రోజులుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదిత మార్పులను పలువురు శాసనకర్తలు, పారిశ్రామికవేత్తలు వ్యతిరేకించారు. ‘‘ఒక వేళ మార్పును తీసుకొచ్చినా హెచ్‌1బి వీసాదారులు అమెరికాను వీడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఏసీ21 చట్టంలోని 106 (ఎ)-(బి) కింద ఏడాదిపాటు గడువు పెంచాలని విజ్ఞప్తి చేయవచ్చు.’’ అని జోనాథన్‌ వెల్లడించారు.

SHARE