Saturday November 17, 2018
స్పైడర్ సినిమా రివ్యూ - Tollybeats

స్పైడర్ సినిమా రివ్యూ

Updated | September 27, 2017 18:44 IST

చిత్రం: స్పైడర్
జానర్: సోషల్ స్పై థ్రిల్లర్
సమర్పణ: ఠాగూర్ మధు
నిర్మాణ సంస్థ: ఎన్వీఆర్ సినిమా ఎల్ఎల్పీ, రియన్స్ ఎంటర్టైన్మెంట్
నటీనటులు: మహేష్బాబు, రకుల్ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య, ప్రియదర్శి, భరత్ తదితరులు
ఫైట్స్: పీటర్ హెయిన్స్
ఛాయాగ్రహణం: సంతోష్ శివన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సంగీతం: హారిస్ జైరాజ్
నిర్మాత: ఎన్.వి.ప్రసాద్, మంజు స్వరూప్
రచన, దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్
విడుదల తేదీ: 27-09-2017
రేటింగ్ : 2.75 / 5

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, పాన్‌ ఇండియా ఇమేజ్‌ ఉన్న మురుగదాస్‌ కలయికలో సినిమా అంటే అది ఆషామాషీగా ఉండదని ఎవరైనా భావిస్తారు. పైగా మహేష్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతుండటం, ఈ సినిమాతో తొలిసారిగా కోలీవుడ్‌ లో అడుగుపెడుతుండటంతో స్పైడర్‌ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  స్టైలిష్‌ స్టార్‌ మహేశ్‌ని, ‘గజిని’, ‘తుపాకి’లాంటి స్టైలిష్‌ సినిమా దర్శకుడు  మురుగదాస్‌ స్పైడర్‌లో ఎంత స్టైలిష్‌ గా చూపించాడో అని ప్రేక్షకులు ఎదురు చూశారు.  మరి బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ‘స్పైడర్‌’ ఎలా ఉందో? ఇందులో మహేష్‌ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే!

కథేంటంటే?: శివ (మహేష్‌ బాబు)  క్రైమ్‌ను, జరగటానికి ముందే  ఆపే అవకాశముందనే ఉద్దేశంతో ఇంటలిజెన్స్‌ బ్యూరో కాల్‌ టాపింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తుంటాడు. ఫోన్‌ సంభాషణల్లో కొన్ని ప్రమాదకర పదాలు వినిపిస్తే తనకు అలర్ట్‌ వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసుకుంటాడు. ఆ విధంగా అనుమానాస్పందగా ఉన్న ఫోన్‌ కాల్స్‌ను పసిగట్టి, డేటా, సాంకేతికత ఆధారంగా పలువురిని ఇబ్బందుల్లో పడకుండా కాపాడుతుంటాడు. ఆ విధంగా , ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో, ఆమెతో పాటు శివ స్నేహితురాలయిన ఓ కానిస్టేబుల్‌ కూడా హత్యకు గురవుతుంది. ఆ హత్యకు కారణాలు  తెలుసుకునే ప్రయత్నంలో భయంకర నిజాలు తెలుస్తాయి. శాడిస్టిక్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ (ఎస్‌పిడి) అనే మానసిక వ్యాధి గ సైకో కిల్లర్ భైరవుడు (యస్‌ జే సూర్య) చిన్నతనం నుంచి హత్య, సామూహిక హత్యలు చేస్తున్నాడని తెలుస్తుంది. శ్మశానంలో పెరిగిన భైరవుడికి చచ్చిన వారిని చూసి ఎవరైనా ఏడుస్తుంటే ఆనందం కలుగుతుంది. భైరవుడు  హైదరాబాద్‌ లో ఎక్కువ మంది చనిపోయేలా ఓ భారీ వినాశనానికి ప్లాన్‌ చేస్తాడు. భైరవుడు చేయాలనుకున్న ఆ వినాశనం ఏమిటి? దాని నుంచి నగరాన్ని శివ కాపాడగలిగాడా? అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే?: నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎలాంటి నేరాన్నయినా ముందస్తుగా అడ్డుకోవచ్చుననే, ఎలాంటి నేరస్తుడినైనా  పట్టుకోవచ్చుననే  పాయింటుకు  ‘సైకో కిల్లర్ ను పట్టుకునే సూపర్‌ హీరో’తో అల్లుకున్న కథ ఇది. సాధారణంగా ఆర్‌.మురుగదాస్‌ సినిమాల్లో బలమైన కథ, కథనం, ఉద్వేగభరితమైన సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమాలో అవి కనపడకపోవడం నిరాశ కలిగించే విషయం. మురుగదాస్‌ మంచి ఆలోచనను కథగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. బలమైన ఎమోషన్స్‌ కనపడవు.  ప్రేక్షకులను ఆసక్తితో కట్టిపడేసే సన్నివేశాలను చూపడంలో దిట్టయిన మురుగదాస్‌, ఈ సినిమాలో  రెండు మూడు మినహా అలాంటి రక్తి కట్టించే సన్నివేశాలను రాసుకోలేకపోయారు. ‘మనకు పరిచయం లేని వాళ్లకు కూడా చేసే సాయమే  నిజమైన మానవత్వం’ అనే  సందేశం కూడా ఒక డైలాగ్‌ గా తప్ప కథకు అతకలేదు. కథలో ఎలివేట్‌ కాలేదు. ఆ పాయింట్‌ ఎటో వెళ్లిపోయింది.  సైకో కిల్లర్ కథలో హీరోను స్పై గా పెట్టి కూడా సైకో బలమైన విలన్‌గా ఎలివేట్‌ కాకపోవడం ఒక లోపం.విలన్‌కి ఆర్థిక బలం, యంత్రాంగం  ఏమిటి? అనేటువంటి పలు లాజిక్కులూ మిస్సయ్యాయి.  ప్రీ క్లైమాక్స్‌ సీన్‌లో విలన్‌ను పట్టుకునే సందర్భంలో రియాలిటీ షో లాంటి సీన్‌,దాని సాంకేతికత, రోలర్‌ కోస్టర్‌ ఫైట్‌లు బాగున్నాయి. మొత్తంగా చూస్తే మురుగదాస్‌ గత చిత్రాల స్థాయిలో ప్రేక్షకులు  కథలో సంలీనం కాలేరు. సాంకేతికత మాత్రం పై స్థాయిలోఉంది. సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. వీఎఫ్‌ఎక్స్‌ సహజంగా తీర్చిదిద్దారు. హరీష్‌ జైరాజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. పాటల ట్యూన్స్‌ అంత బాగా లేదు. నిర్మాణ విలువలు బావున్నాయి.

ఎవరెలా చేశారంటే: మహేష్‌ అందంగా స్టైలిష్‌గా కనిపించడమే కాక తనదైన ఈజ్‌తో నటించాడు. అందంగా కనిపించి అలరించినా, రకుల్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ప్రతినాయకుడు భైరవగా ఎస్‌.జె. సూర్య  నటన  ఆకట్టుకుంటుంది.  భైరవ చిన్న నాటి పాత్రలో నటించిన బాల నటుడు కూడా పాత్రలో ఒదిగిపోయాడు. ప్రియదర్శి పులికొండ, ఆర్జే బాలాజీని సరిగా వినియోగించుకోకున్నా, ఉన్నంతలో వారు బాగా చేశారు. 

బలాలు: మహేష్, సూర్య నటన, సాంకేతికత, రెండు మూడు భారీ సీన్లు
బలహీనతలు: కథ తడబడటం, బలహీనంగా ఉన్న కథనం
ముక్తాయింపు: సైకో కిల్లర్ వర్సెస్ స్పై భారీ హంగు సినిమా

SHARE