Saturday November 17, 2018
శ్రీ వల్లీ సినిమా రివ్యూ - Tollybeats

శ్రీ వల్లీ సినిమా రివ్యూ

Updated | September 17, 2017 11:29 IST

చిత్రం: శ్రీ వల్లీ
జోనర్: సోషియా సైంటిఫిక్ ఫాంటసీ
నటీనటులు : నేహ హెంగే, రజత్, రాజీవ్ కనకా తదితయి
సంగీతం : ఎం.ఎం శ్రీలేఖ, శ్రీ చరణ్ పాకాల
నిర్మాతలు: సునీత, రాజ్ కుమార్ బృందావన్
కథ, దర్శకత్వం : విజయేంద్ర ప్రసాద్
విడుదల తేదీ : సెప్టెంబర్ 15, 2017
రేటింగ్ : 2.5 / 5

గతంలో ఎన్ని సినిమాలకు కథందించినా.. బాహుబలి, బజరంగీ భాయ్‌ జాన్‌ సినిమాలతో చక్కని డ్రామాను అందించే రచయితగా విస్తృత గుర్తింపు పొందిన రచయిత విజయేంద్ర ప్రసాద్‌, ఆమధ్య రాజన్న సినిమాతో దర్శకుడుగానూ మారారు. తాజాగా తనే కథను సమకూర్చుకుని దర్శకత్వం వహించిన సినిమా శ్రీ వల్లీ. ఇంతవరకూ ఎవరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌తో రాసుకున్న ఈ కథ పట్ల విజయేంద్ర ప్రసాద్‌ తన మక్కువను పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయనే దర్శకత్వం వహిస్తుండగా శ్రీవల్లీపై మంచి అంచనాలే నెలకొన్నాయి. కథ ప్రాధాన్యంగా దాదాపు పూర్తిగా కొత్త తారాగణంతో తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం!

 కథేంటంటే?: సైంటిస్ట్‌ అయిన రామచంద్ర(రాజీవ్‌ కనకాల) శాస్త్ర పరిశోధనకు సాయపడేందుకు రు.20 వే కోట్లతో ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తాడు. ఆయన కూతురు శ్రీవల్లి (నేహా హెంగే, ఆమె చిన్ననాటి స్నేహితుడు గౌతమ్‌(రజిత్‌) ప్రేమించుకుంటారు. ప్రమాదంలో తండ్రి చనిపోయి, తమ్ముడు కోమాలోకి వెళ్లి పోవడంతో ట్రస్ట్‌ బాధ్యత రీత్యా పెళ్లి చేసుకోలేనని గౌతమ్‌కి చెపుతుంది శ్రీవల్లి. గౌతమ్‌ ఆమెకి సాయంగా ఉంటూంటాడు. ఈ దశలో ఆమె న్యూరో ఫిజిక్స్‌ మీద రీసెర్చ్‌ చేసే ప్రొఫెసర్‌కి పరిశోధనకు సంబంధించిన ప్రయోగంలో తనే సబ్జెక్ట్‌గా మారుతుంది. ఒకరి న్యూరాన్స్‌ సహాయంతో ఆలోచనలను అనుసంధానించడం ద్వారా మరొకరి మనసులోని విషయాలను తెలుసుకోవడం, వాటిని అదుపు చేయడం సాధ్యమయ్యే ప్రయోగం అది.  ఈ ప్రయోగం తర్వాత ప్రొఫెసర్‌ అమెరికా వెళతాడు. అయితే గత జన్మలు గుర్తుకు వచ్చే ప్రమాదమున్న ఆ ప్రయోగంతో, ఆమె తను పూర్వ జన్మలో ‘లైలా’ అని భావించే లాంటి సంఘటనలు.., ఆ క్రమంలో రాత్రి వేళ ‘మజ్ను’ వచ్చి ఆమెతో శృంగారం చేస్తున్నట్లు రుజువులు కనిపిస్తాయి. అలాగే తనను కాలేజి రోజ్నుంచి నుంచో వెంటాడుతున్న లెస్బియన్‌ అయిన ఆండ్రియా కూడా తనతో శృంగారం జరుపుతుంది. ఈ విషయాన్ని గౌతమ్‌కు చెప్పగా, శ్రీవల్లీ కి తెలియకుండా అతడెళ్లి ఆండ్రియాను చంపేస్తాడు. కాగా శ్రీవల్లీ వర్జిన్‌ అని ఒక సందర్భంలో డాక్టర్లు చెపుతారు. ఈ పరిస్థితుతో ఉక్కిరి బిక్కిరయిన శ్రీవల్లీ, గౌతమ్‌తో  ‘‘మనం పెళ్లి చేసుకుందాం.. ఇకపై నా బాధ్యతలను, ట్రస్ట్‌ బాధ్యతలనూ నువ్వే చూడు’’ అంటుంది.  ఆపై ఏం జరిగింది? వారి పెళ్లి అయిందా? వారు ఆ పరిస్థితులను ఎదిరించగలిగారా? అసలు ఈ సంఘటనకు కారకులు ఎవరు? అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే?: ఒక కాల్పనిక  సైన్స్‌ ఫిక్షన్‌ కథను  కొంత హారర్‌, మరికొంత శృంగారంతో అల్లుకున్న కథనం శ్రీవల్లీ. నిజింగానే తెలుగులో ఈ న్యూరో అంశాన్ని పెద్దగా ఎవరూ టచ్‌ చేయలేదనే చెప్పాలి. ఒక మనిషి భావ తరంగాలతో వేరొక మనిషి ఆలోచనలలోకి ప్రవేశించి వారిని నియంత్రించడం అనేది కొత్త విషయమే.  తదుపరి ఏం జరుగుతుందనేది ప్రేక్షకుల ఊహలకు కూడా అందకుండా నడిపించడంతో దర్శకుడు సక్సెస్‌ అయ్యారు.  అయితే  కథనంలో కొంత కన్ఫ్యూజన్‌ కనిపిస్తుంది. మంచి కథను చెప్పాలనుకోవడం, సస్పెన్స్‌గా నడిపించాలను కోవడం ఎంత అవసరమో ప్రేక్షకులకు అర్ధమయ్యే రీతిలో చెప్పడం కూడా అంతే అవసరం. అక్కడే కథనం కాస్త తడబడిరది. ఏది ఫ్లాష్‌ బ్యాక్‌, ఇది రియల్‌, ఇది సైన్స్‌ అనే విషయాలలో కొంత క్లారిటీ వస్తే బాగుండేది. సినిమాలో లాజిక్కులూ మిస్సయ్యాయి. సెకన్ల కాల పరిమితి ఉన్న కొన్ని సన్నివేశాలను సైతం సస్పెన్స్‌ కోసం కావాలనే పెట్టినట్లు, కథనానికి అతకనట్లు కనిపించడం లోపం. కొన్ని సీన్స్‌ మరీ సిల్లీగా అనిపిస్తాయి. ఇక సినిమాలో సీన్స్‌ అన్నీ పరిసర ప్రజా వాతావరణంతో సంబంధం లేనట్లు (దీనివల్ల మన నేటివిటీ కనపడనట్లు ఉంటుంది.) నడుస్తాయి. అలాగే డైలాగులు సహజంగా కాక బిజినెస్‌ లైక్‌గా ‘కట్టె కొట్టె తెచ్చె’ అన్నట్లు అతి సూటిగా ఉంటాయి. ఎక్కడా సహజ వాతావరణం కనపడదు. న్యూరో ప్రయోగం కూడా గ్రాఫిక్స్‌ తో తీసినా సూడో స్థాయిలో కనిపిస్తుంది. ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యేందుకు కనీసం తెలిసిన నటీనటులూ లేరు. చివరిలో సినిమా సస్పెన్స్‌ విడివడినప్పుడు బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌లో శ్రీ చరణ్‌ పాకాల, పాటల్లో ఎం.ఎం శ్రీలేఖ బాగానే చేశారు. సినిమా నిర్మాణ విలువలు భాగానే ఉన్నాయి. కథను బాగా ఊహించినా, సీన్స్‌`డైలాగ్స్‌`స్క్రీన్‌ ప్లే విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటే తెరపైకి బాగా ఎక్కేదనిపించింది. మొత్తంగా విజయేంద్ర ప్రసాద్‌  ప్రయత్నం మెచ్చదగినదే!

ఎవరెలా చేశారంటే? : కీలకమైన శ్రీవల్లి పాత్ర చేసిన హీరోయిన్‌ నేహ బాగానే చేసింది. ఒక విధంగా ఆమెకి అనుభవానికి మించిన పాత్ర. శృంగార సన్నివేశాల్లోనూ మెప్పించింది. ఇక హీరోగా చేసిన కొత్తకుర్రాడు రజిత్‌ ఎమోషన్స్‌ ని చూపించడంలో ఇంకా మెరుగుపడాలి. ప్రొఫెసర్‌ పాత్రదారి ఒకె. రాజీవ్‌ కనకాల పెద్ద తరహా పాత్రలకు ఇంకా ఒదగాలి. 

బలాలు: కథ, సస్పెన్స్, ముగింపు, శృంగార సన్నివేశాలు
బలహీనతలు: కథనంలో కన్ఫ్యూజన్, లాజిక్కు మిస్సవడం, సీన్స్, డైలాగులు సహజత్వాన్ని కోల్పోవడం
ముక్తాయింపు: సైన్స్ ఫిక్షన్ ఇష్ట పడేవారు కొత్త కథగా చూడగలిగితే ఒకె

SHARE