Sunday January 21, 2018
శశికళ బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు - Tollybeats

శశికళ బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు

Updated | December 28, 2017 12:02 IST

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు జరిపారు. చెన్నై, కోయంబత్తూర్‌లోని మొత్తం 6 ప్రాంతాల్లో ఐటీ దాడులు చేపట్టినట్లు సంబంధిత సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో స్వత్రంత్య అభ్యర్థిగా పోటీ చేసిన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ ఘన విజయం సాధించిన మూడు రోజుల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.

చెన్నైకి సమీపయంలోని పడప్పై మిడాస్‌ మద్యం తయారీ జరిగే ప్రాంతం, సాయి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ, శశికళ బంధువు కార్తికేయన్‌ అడయార్‌ నివాసం, కోయంబత్తూర్‌లోని ఓ కళాశాల, ట్రెజరీ హౌస్‌ తదితర ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. గత నెల 9 నుంచి 13వ తేదీ వరకు శశికళ బంధువులు, మద్దతుదారులకు సంబంధించిన 187 స్థలాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో పలు కీలకమైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ.1,430 కోట్లు లెక్కల్లో చూపని పెట్టుబడులను అధికారులను గుర్తించారు.

 

 

 

SHARE