Saturday November 17, 2018
వైకాపాలోకి మాజీమంత్రి - Tollybeats

వైకాపాలోకి మాజీమంత్రి

Updated | September 3, 2017 17:03 IST

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా. అంతుచిక్కని రాజకీయాలతో దిక్కుతోచని స్ధితిలో ఉన్న సిక్కోలు కాంగ్రెస్ నేతలు ఎటువైపు చూస్తున్నారు. జిల్లాలో వైకాపా తీర్ధం పుచ్చుకోవటానికి సిద్ధమైన మాజీ కేంద్రమంత్రి ఎవరు. 

పోరాటాల పురిటిగడ్డగా పేరున్న శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువనే చెప్పాలి. ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తారో.. ఎవరిని అధఃపాతాళానికి తొక్కేస్తారో తెలుసుకోవటం రాజకీయ ఉద్దండులకు సైతం సాధ్యం కాదు. ఇంతటి రాజకీయ చైతన్యం కలిగిన సిక్కోలు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేతల అంతరంగాలు, వారి మంత్రాంగాలు అర్ధంకాక పరిశీలకులు సైతం తలలు పట్టుకుంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా కు ముందు వరకూ కాంగ్రెస్‌పార్టీకి కంచుకోట అనే చెప్పాలి. రాష్ట్ర విభజన పుణ్యమా అని జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ కనుమరుగైపోయింది. జిల్లాలో పార్టీ పరిస్ధితిని గమనించిన ధర్మాన వంటి నేతలు ముందే తట్టాబుట్టా సర్ధుకున్నారు. ఇక జిల్లాలో మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్, కిల్లి కృపారాణిలే ఆ పార్టీకి పెద్దదిక్కు అయ్యారు. అప్పుడప్పుడూ వారు చిన్నాచితకా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు కాంగ్రెస్‌పార్టీని మరిచిపోకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.

ఇలాంటి తరుణంలో జిల్లా కాంగ్రెస్‌ను మరో అంశం కలవరపెడుతోంది. మన్మోహన్‌సింగ్ క్యాబినెట్‌లో కేంద్రమంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణి పార్టీ మారబోతున్నట్టు గత వారం రోజులుగా జిల్లాలో టాక్ నడుస్తోంది. టీడీపీలో రాజకీయ దిగ్గజంగా వర్థిల్లిన దివంగత ఎర్రంనాయుడుపై అనూహ్య విజయం సాధించి కాంగ్రెస్ హైకమాండ్‌కు అప్పట్లో కృపారాణి దగ్గరయ్యారు. ఆమెను కేంద్రమంత్రి పదవి కూడా వరించింది. ధర్మాన అండదండలతో రాజకీయంగా ఎదిగిన కృపారాణి గతంలోనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలోకి వెళతారంటూ గుసగుసలు వినిపించాయి. అయినప్పటికీ కృపారాణి కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీ పట్ల తన విధేయతను చాటుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీ పరిస్ధితి రోజురోజుకూ దిగజారిపోతోంది. 2019  ఎన్నికల నాటికైనా పార్టీ పరిస్ధితి మారుతుందా అంటే ఆ దాఖలాలు కూడా కనిపించటం లేదు. దీంతో కృపారాణి వైకాపాలోకి వెళ్లటానికి నిశ్చయించుకున్నట్టుగా కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధినేత జగన్‌తో ఆమె చర్చలు జరిపినట్టు వినికిడి. అయితే సీటు విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడం వల్లే కృపారాణి వైకాపా తీర్ధం పుచ్చుకోవటం ఆలస్యమవుతోందని ఆమె అనుచరులు చెబుతున్నారు.

వాస్తవానికి టెక్కలి నియోజకవర్గంతో కృపారాణికి అనుబంధం ఎక్కువనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తనకు టెక్కలి అసెంబ్లీ సీటు కేటాయించాలని కృపారాణి వైకాపా అధినేతను కోరారట. అయితే ఇప్పటికే అక్కడ ఇద్దరు నియోజకవర్గ బాధ్యులు ఉన్నందున టెక్కలిపై వైకాపా అధిష్టానం నుంచి కృపారాణికి అనుకూల సంకేతాలు రాలేదట. దీంతో తన సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న పలాస నియోజకవర్గంపై కృపారాణి దృష్టి సారించారట. పలాస సీటు తనకు ఖాయం చేయాలని జగన్ వద్ద లాబీయింగ్‌ చేశారట. దీనిపై త్వరలో స్పష్టత వస్తుందనీ, వైకాపా నుంచి పిలుపు అందుతుందనీ కృపారాణి ఎదురు చూస్తున్నారట.

అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి త్వరలోనే కృపారాణి వైకాపాలో చేరడం ఖాయమంటూ జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే నియోజకవర్గం కేటాయింపుపై వైసీపీ అధినేత నుంచి క్లారిటీ రాకుండా పార్టీలో చేరితే మొదటికే మోసం వస్తుందేమో అన్న అనుమానాలు ఆమె అనుచరులు వ్యక్తంచేస్తున్నారు. చూద్దం కృపారాణి నిర్ణయం ఎలా ఉండబోతుందో..!

 

SHARE