Saturday November 17, 2018
వివేకం సినిమా రివ్యూ - Tollybeats

వివేకం సినిమా రివ్యూ

Updated | August 25, 2017 12:10 IST

సినిమా : వివేకం
జానర్‌ : స్పై థ్రిల్లర్
నిర్మాణసంస్థ : సత్యజ్యోతి ఫిలింస్‌
తారాగణం : అజిత్‌, వివేక్‌ ఓబెరాయ్‌, కాజల్‌, అక్షర హాసన్‌, శరత్‌ సక్సేనా, భరత్‌ రెడ్డి, కరుణాకరన్‌, ఆరవ్‌ చౌదరి తదితరులు
ఛాయాగ్రహణం : వెట్రి
కూర్పు : రూబెన్‌
సంగీతం : అనిరుథ్‌
నిర్మాతలు : సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌
రచన, దర్శకత్వం : శివ
విడుదల : 24 ఆగస్టు 2017
రేటింగ్‌ : 3 / 5

భాషా బేధాన్ని అధిగమిస్తున్న పరిణామదశలో భారతీయ సినిమా ఉంది. ముఖ్యంగా దక్షిణాది సినిమాలు ప్రాంతీయత నుంచి బయటపడి పరస్పరం అనువాదమవడం, ద్వి,త్రిభాషా చిత్రాలుగా నిర్మించబడుతుండటమే కాక చిత్రీకరణలోనూ బాలీవుడ్‌,హాలీవుడ్‌ స్థాయిని అందుకుంటున్నాయి. ఆ విధంగా భారీ స్థాయిలో తెలుగు, తమిళంలో ఏక కాలంలో చిత్రీకరించబడి, విడుదలయిన చిత్రం వివేకం. కోలీవుడ్‌ హీరో అజిత్‌ 25వ సినిమాగా, ఆయనతోనే వీరం, వేదాళం వంటి వరుస విజయాలు అందించిన దర్శకుడు శివ రూపొందించిన చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ‘దరువు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన శివ, అజిత్‌ వివేకంతో దానిని సాధించాడా? అనేది చూద్దాం.

కథేంటంటే : తన భార్య(కాజల్‌)తో కలిసి ఓ రెస్టారెంట్‌ నడుపుతూండే ఎకె అలియాస్‌ అజయ్‌ కుమార్‌ (అజిత్‌ కుమార్‌) నిజానికి కౌంటర్‌ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ లో సీక్రెట్‌ ఏజెంట్‌. తన వృత్తి సహచరులు, స్నేహితులు అయిన ఆర్యన్‌ (వివేక్‌ ఒబెరాయ్‌) తదితర నలుగురితో కలిసి పలు మిషన్‌ల ను విజయవంతం చేసిన అజయ్‌, ఒక  మిషన్‌ లో ఉండగా అదృశ్యమై, ఓ అంతర్జాతీయ విధ్వంసక మూఠాను మట్టుబెట్టి  బ్రతికే ఉన్నట్లు డిపార్ట్‌మెంట్‌కు  వెల్లడవుతాడు.ఈ క్రమంలో.. భారత్‌ భూగర్భంలో ప్లుటోనియం అణుబాంబును పేల్చి కృత్రిమ భూకంపాలు సృష్టించి  ఆ పరిస్థితులకు క్యాష్‌ చేసుకోవాలనుకుంటాయి కొన్ని అంతర్జాతీయ క్యాపిటల్‌ శక్తులు.ఆ బాంబును శాటిలైట్‌ సాయంతో పేల్చేందుకు రెండు డివైజ్‌లను తయారు చేస్తారు. అది తెలిసి, వారిని నియంత్రించే ఆపరేషన్‌ను చేపట్టిన ఎ.కె., ఆర్యన్‌ అండ్‌ బృందం ఆ డివైజ్‌లను చేజిక్కించుకుని వాటిని నాశనం చేయాలని బయలుదేరుతుంది. ఆ డివైజ్‌ను నటాషా(అక్షర హాసన్‌) అనే హ్యాకర్‌ దగ్గర ఉన్నట్లు కనుగొని ఎ.కె. ఆమెను పట్టుకుంటాడు. కానీ నటాషా మంచితనం చూసి ఆమె ద్వారానే డివైజ్‌లను నాశనం చేయాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో నటాషాను ఎవరో కాల్చి చంపేస్తారు. ఎ.కె.ను కూడా వారే చంపడానికి ప్రయత్నిస్తారు. ఇంతకు ఎ.కె. ను చంపాలనుకున్నదెవరు? ఎ.కె ఆ డివైజ్‌లను నాశనం చేశాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే? : ఒక సీక్రెట్‌ ఏజెంట్‌ కథకు.. దేశం కోసం పోరాడే భర్త ,తనకు సహకరించే భార్య మధ్య భావోద్వేగ భరితమైన సెంటిమెంట్‌ను జోడిస్తూ అల్లుకున్న కథనం వివేకం. సినిమా చూస్తున్నంత సేపూ ఓ హాలీవుడ్‌ సినిమా చూస్తున్నామేమో అనిపిస్తుంది. నటాషాని అన్వేషించే సీన్స్‌ ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ఇంటర్వెల్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు హీరో`విలన్‌ మధ్య ఎత్తులు పైఎత్తులతో సీన్స్‌ను ఆసక్తికరంగా రూపొందించాడు దర్శకుడు. అయితే సన్నివేశాలు సాధారణ ప్రేక్షకుడి వూహలకు అందని స్థాయిలో పైగా పరుగులు తీస్తూ వుంటాయి. పైగా అత్యధిక సీన్స్‌..  టెక్నాలజీ, సంబంధింత టెర్మినాలజీతో సాగుతాయి. సినిమాను హాలీవుడ్‌ స్థాయిలో రూపొందించే ప్రయత్నం చేసిన  దర్శకుడు, పలు సన్నివేశాలలో లాజిక్కు మిస్‌ అవడంలో, మోతాదును మించిన హీరోయిజాన్ని చూపడంలో మాత్రం మన ప్రాంతీయ స్థాయికి దిగిపోయాడు.  ఇక భార్యాభర్తల మధ్య అనుబంధం, వాళ్ల మధ్య సన్నివేశాల్ని బాగా చూపించినా, క్లైమాక్స్‌లో కూడా సెంటిమెంట్‌ను అతికించడం, దానికి పాటను సైతం జత కూర్చడంతో ఒక్కసారిగా  ఏమి సినిమా చూస్తున్నాం! అనిపిస్తుంది. ఇక   సినిమా అత్యధికం యూరోపియన్‌ దేశాలలో జరుగుతుండగా ఇంగ్లిష్‌ మాటలకు సబ్‌ టైటిల్స్‌ వేశారు. సినిమా ఫస్టాఫ్‌లో ఆల్బేరియా లాంటి దేశాలో తిరిగేప్పుడు హీరోకి దుబాసీ కూడా ఉంటాడు. అంత వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాతే యూరోపియన్స్‌తో సహా అందరూ తెలుగే మాట్లాడుతుంటారు.  ఏదైనా ఒక పద్ధతి ఎంచుకోవాల్సింది. ఇక టైటిల్స్‌లో తెలుగు అక్షరాలు విడిపోయాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే డబ్‌ అయిన భాషా ప్రేక్షకులు నొచ్చుకుంటారు.  సినిమాను ఉరుకులు పెట్టించిన వెట్రి సినిమాటోగ్రఫీ, షార్ప్‌ కట్స్‌తో అంతే పరుగులు తీయించిన రూబెన్‌ ఎడిటింగ్‌, అనిరుధ్‌ సంగీతం ప్రధాన బలాలు. పాటల్లో మాత్రం సంగీతం బాగలేదు.  సత్యజ్యోతి ఫిలింస్‌ నిర్మాణ విలువలు భారీగా బాగున్నాయి.  సెంటిమెంట్‌తో సినిమాను ఊగిసలాడించడం మినహా సినిమా ప్రధాన కథనంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి.

ఎవరెలా నటించారంటే? : అజిత్‌ సెంటిమెంట్‌, యాక్షన్‌, ఎమోషన్‌లు కల గలిసిన పాత్రలో పరిపూర్ణత చూపాడు.యాక్షన్‌ సీన్స్‌లో అజిత్‌ శ్రమ స్పష్టంగా కనిపిస్తుంది. గ్లామర్‌ షోకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని పాత్రలో కాజల్‌ ఆకట్టుకుంది. కీలక పాత్రలో వివేక్‌ ఒబరాయ్‌ మరోసారి ఆకట్టుకున్నాడు. కొద్దిసేపే కనిపించినా మరో ప్రధాన పాత్రలో అక్షర హాసన్‌ ఒదిగిపోయి నటించింది. మిగతా వారు పరిధి మేరకు నటించారు.

బలాలు : హాలీవుడ్‌ స్థాయి చిత్రీకరణ,గ్రాండ్‌ విజువల్స్‌, సాంకేతికత, అజిత్‌, వివేక్‌ ఒబరాయ్‌ నటన,యాక్షన్‌ సీన్స్‌
బలహీనతలు : ఇల్లాజికల్‌ సీన్స్‌, సినిమా అతి వేగం, క్లైమాక్స్‌లో సెంటిమెంట్‌ మోతాదు మించడం
ముక్తాయింపు : ఒక విధంగా ఆకట్టుకునే స్పై థ్రిల్లర్

 

SHARE