Saturday November 17, 2018
లై సినిమా రివ్యూ - Tollybeats

లై సినిమా రివ్యూ

Updated | August 12, 2017 11:31 IST

చిత్రం పేరు : లై .. లవ్ . ఇంటెలిజెన్స్ . ఎనిమిటి
జోనర్ : స్పై థ్థ్రిల్లర్
నిర్మాణ సంస్థ : 14రీల్స్ ఎంటర్టైన్మెంట్
నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్, అర్జున్, శ్రీరామ్, అజయ్, నాజర్, రవికిషన్, బ్రహ్మాజీ, పృథ్వీ, సురేష్, మధుసూధన్, రాజీవ్కనకాల, పూర్ణిమ తదితరులు
ఛాయాగ్రహణం : జె.యువరాజ్
ఎడిటింగ్ : ఎస్.ఆర్.శేఖర్
సంగీతం : మణిశర్మ
నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం : హను రాఘవపూడి
విడుదల తేదీ : 11-08-2017
రేటింగ్ : 3 / 5

తొలినాళ్లలో వయసుకు మించిన మాస్‌ పాత్రలతో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఇష్క్‌ నుంచి ఏజ్‌కు తగ్గ స్టైలిష్‌ కుర్రాడి పాత్రలతో విజయం సాధిస్తూ  ‘అఆ’ తో ఫ్యామిలీ హీరోగానూ సక్సెసయ్యాడు నితిన్‌. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ వంటి డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌తో  తన మార్క్‌ను చూపిన దర్శకుడు.. హను రాఘవపూడి. వీరిద్దరి కలయికతో వచ్చిన సినిమా కావడం,  ప్రమోస్‌లో నితిన్‌ లుక్‌, థ్రిల్లింగ్ సన్నివేశాలు ఆసక్తిగా ఉండటంతో ‘లై’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలను ‘లై’ అందుకుందా? చూద్దాం!

కథేంటంటే : భారత పోలీసుల టార్గెట్‌గా ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌,  ప్రాపంచకంగా ఇండియన్‌ రోప్‌ ట్రిక్‌ వంటి క్లాసిక్‌ మేజిక్‌ను ప్రదర్శించగలిగిన వరల్డ్‌ క్లాస్‌ మెజీషియన్‌ పద్మనాభం (అర్జున్‌)గా అమెరికాలో నివసిస్తూంటాడు. ఇండియా నుంచి అతని కోసం పంపబడుతున్న ఒక ‘సూట్‌’ ద్వారా, 19 ఏళ్ల తర్వాత  వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని అతన్ని పట్టుకోవాలనుకుంటాడు సెంట్రల్‌ ఇంటిలిజెన్స్‌ ఎసిపి (రవికిషన్‌). ‘షోలే’ అని పేరు పెట్టబడిన ఆ మిషన్‌ బాధ్యతతో  ఆది (శ్రీరామ్‌) అమెరికాకి  బయలు దేరతాడు. ఇదిలా ఉంటే...  తల్లి మాట వినక, అబద్ధాలు ఆడుతూ పర్సులు కొట్టుకు బతికే ఎ. సత్యం(నితిన్‌) అనే హైదరాబాదీ పోకిరీ కుర్రాడు, లాస్‌ వెగాస్‌లో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్‌ అవ్వాలనుకుంటాడు.  డబ్బు కక్కుర్తి మనిషయిన చైత్ర (మేఘా ఆకాష్‌) అనే అమ్మాయి, (క్యాన్సిల్‌ అయిన)హనీమూన్‌ కోసం  ట్రావెల్‌ ఏజెన్సీకి కట్టిన డబ్బు తిరిగి రావని  తెలిసి, ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు సత్యంను కలుపుకుని అమెరికా బయలు దేరుతుంది. ఆ జర్నీలో వారి మధ్య ఆకర్షణ మొదలవడం ఒకటైతే, పద్మనాభానికి చేరాల్సిన ఆ ‘సూట్‌’, సత్యం చేతికి చిక్కడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ ‘సూట్‌’ కోసం ఆది`పద్మనాభం  మధ్య జరిగే ఎత్తులు పైఎత్తులతో ఆ మిషన్‌లో సత్యం ఇరుక్కుంటాడు. ఆపై దానిని తనే లీడ్‌ చేస్తాడు. అసలు సత్యం ఎవరు? ఆ సూట్‌ని ఏం చేశాడు? ఆ ‘సూట్‌’ వెనుక రహస్యం ఏమిటి?  హీరో, విలన్‌ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? పద్మనాభం పోలీసులకు దొరికాడా? అనే మిగతా అర్థ భాగాన్ని తెరపై చూడాల్సిందే!

ఎలా ఉందంటే : తెలివైన విలన్‌ను పట్టుకునే క్రమంలో.. అతనికీ హీరోకి మధ్య సాగే మైండ్‌ గేమ్‌ను ప్లాన్‌ చేసుకుని, ఆ మేరకు చిన్న కథను ఆసక్తికరంగా అల్లుకున్న కథనం ఈ సినిమా.  హాలీవుడ్‌లో, అప్పుడప్పుడూ మన వద్దా కూడా ఈ జోనర్‌ తరహా సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే విలన్‌ను ఎలివేట్‌ చేసి, ఆ తరువాత హీరో ను  ఎలివేట్‌ చేయడంలో ఇది డిఫరెంట్‌గా కనిపిస్తుంది. పద్మనాభం-సత్యం మధ్య సాగే  స్టైలిష్‌ దాగుడుమూతలు, ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది.సన్నివేశాలను దర్శకుడు తెలివిగా రాసుకున్నాడు.  ఇతరత్రా హాస్యం నింపకుండా సినిమా నడకనే సీరియస్‌నెస్‌తో పాటు అక్కడక్కడా వినోదంగానూ మలిచాడు దర్శకుడు.  పాటలు బాగున్నా, వాటిని అందమైన ప్రదేశాల్లో తెరకెక్కించినా, అవి అసందర్భంగా వచ్చి ఇబ్బంది కలిగిస్తాయి. ‘‘బలహీనత లేని బలవంతుడిని భగవంతుడు ఇప్పటివరకు సృష్టించలేదు’, ‘కోట్ల మంది సైనికులు సరిపోలేదు.. పంచపాండవులు సాధించలేదు.. అబద్ధం తోడు లేకుండా కురుక్షేత్రం పూర్తికాలేదు.. అశ్వత్థామ హత: కుంజర:’’ వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. అయితే పద్మనాభం ఎందువల్ల మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినలో చెప్పకపోవడం, ఆ సూటు ప్రాధాన్యాన్ని  ప్రేక్షకుడికి మరింత అర్థమయ్యేలా చెప్పక పోవడం స్వల్ప లోపాలే దీనివల్లనే సినిమా ద్వితీయార్ధంలో కాస్త తడబాటు కనిపిస్తుంది. అంతేకాక అక్కడక్కడా లాజిక్కు మిస్సయ్యాయి. స్క్రీన్‌ ప్లే పరంగా బాగున్నా, సత్యం ఎవరో తల్లికి, అధికార్లకు కూడా తెలవనట్లు ఫస్టాఫ్‌ అంతా నడపడం.. కూడా ఎంత ‘అండర్‌ కవర్‌’ అనుకున్నా ఇల్లాజికలే. సినిమాను అందమైన లొకేషన్‌లో తీసినా, కొన్ని ప్రదేశాలు, కొన్ని డైలాగ్‌లు, ఈక్వేషన్లు సామాన్య ప్రేక్షకుడికి వేంటనే అర్థం కాకపోవచ్చు.  ఇక యువరాజ్‌ కెమారా  హైదరాబాద్‌, ముంబై, శాన్‌ప్రాన్‌సిస్కో, జోర్డాన్‌, లాస్‌ వేగాస్ లను అందంగా చుట్టేసింది. శేఖర్‌ ఎడిటింగ్‌ సరిపోయింది. పాటలు, రీ రికార్డింగ్‌ రెండింటా మణిశర్మ సంగీతం బాగుంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. లై ను యాక్షన్‌ థ్థ్రిల్లర్ గా రూపొందించడంలో హను రాఘవపూడి విజయం సాధించాడు.

ఎవరెలా చేశారంటే : స్టైలిష్‌డ్‌ యాక్షన్‌ పాత్రను నితిన్‌ హుషారుగా సటిల్డ్‌గా చేసి, యాక్షన్‌ చిత్రాలనూ అద్భుతంగా చేయగలనని నిరూపించాడు.  అతనిలోని పరిణత నటన ఎలివేట్‌ అయింది. నటన, డ్యాన్స్‌, ఫైట్స్‌, రొమాన్స్‌.. ఇలా అన్నింట్లోనూ అది కనిపించింది. యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరైన అర్జున్‌, ఊసరవెల్లి లాంటి  డిఫరెంట్‌ విలన్‌గా అద్భుతంగా నటించాడు. మేఘా ఆకాష్‌ కొత్త నటి అయినా  క్యూట్‌ గా చేసింది.  శ్రీరామ్‌, రవికిషన్‌, నాజర్‌, అజయ్‌, తదితరులు పాత్రల పరిధిమేరకు చక్కగా నటించారు. నిన్నటి తరం హీరోయిన్‌ పూర్ణిమ తొలిసారి హీరో తల్లిగా దర్శనమిస్తే.. రాజీవ్‌ కనకాల తొలిసారి హీరోయిన్‌కి తండ్రిగా పెద్ద పాత్రలో కనిపించడం ఇందులో విశేషం. ట్రావెల్‌ ఏజెంట్‌గా సీనియర్‌ ఆర్టిస్ట్‌ కాదంబరి కిరణ్‌ కుమార్‌, ఇంకా హీరో ఫ్రెండ్‌ పాత్రలో మధునందన్‌, ఇంద్రకుమార్‌, నారదశర్మ.. పురాణ పాత్రలో పృథ్వీ, బ్రహ్మాజీలు నవ్వులు పంచారు.

బలాలు : కథనం, ట్విస్టు, స్టైలిష్ మేకింగ్, హీరో విలన్ నటన, సంగీతం
బలహీనతలు : స్వల్పంగా లాజిక్ మిస్సవడం, రొటీన్ రివెంజ్ ను అద్దటం
ముక్తాయింపు : లవ్ యాక్షన్ కగలిపిన ఇంటెలెక్చువల్ స్పై థ్థ్రిల్లర్

 

SHARE