Sunday January 21, 2018
రజనీకి తెలుసు ధనుష్ నా కొడుకేనని !! - Tollybeats

రజనీకి తెలుసు ధనుష్ నా కొడుకేనని !!

Updated | December 29, 2017 13:09 IST

చెన్నై: ప్రముఖ సినీనటుడు ధనుష్‌ తన కుమారుడేనంటూ ఇన్నాళ్లూ కోర్టుకు, మీడియాకెక్కిన మేలూరు వృద్ధుడు కదిరేశన్‌.. తాజాగా మరో బాంబు పేల్చాడు. ధనుష్‌ తన కొడుకేనన్న విషయం ఆయన మామ, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు కూడా బాగా తెలుసని ప్రకటించారు.

గురువారం రజనీకాంత్‌ అభిమానులతో ఫొటో సెషన్‌లో బిజీగా ఉన్న సమయంలో కదిరేశన్‌ ఈ ప్రకటన చేసి సంచలనం రేపారు. ధనుష్‌ తమ కుమారుడని గతంలో కదిరేశన్‌ మేలూరు కోర్టులో కేసు వేయడం, ఆ కోర్టు విచారణపై ధనుష్‌ వర్గం స్టే తెచ్చుకుని, హైకోర్టును ఆశ్రయించి కేసు నుంచి పూర్తిగా బయటపడటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో చెన్నైలో రజనీకాంత్‌ బుధవారం అభిమానులకు చక్కటి సలహా ఇచ్చారు. తన అభిమానులు ఎల్లప్పుడూ వారి తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపుపై స్పందించిన కదిరేశన్‌ రజనీకి ఓ లేఖ పంపుతున్నట్లు ప్రకటిస్తూ, మేలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆ లేఖను పాత్రికేయులకు చూపెట్టారు.

ఆసుపత్రిలో తన భార్య అనారోగ్యంతో చికిత్స పొందుతోందని, ఈ పరిస్థితులలో తమకు అండగా కుమారుడు లేడన్న దిగులుతో కుంగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను చూసుకోవాలంటూ అభిమానులకు చక్కని సలహా ఇచ్చిన రజనీ, తమ బిడ్డ అయిన ధను్‌షను తమ వద్దకు పంపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను చూసైనా రజనీకాంత్‌ అతడికి బుద్ధి చెప్పి తమ వద్దకు పంపాలని కదిరేశన్‌ కన్నీళ్లతో వేడుకున్నారు.

SHARE