Sunday January 21, 2018
యుద్ధం శరణం సినిమా రివ్యూ - Tollybeats

యుద్ధం శరణం సినిమా రివ్యూ

Updated | September 8, 2017 19:01 IST

సినిమా : యుద్ధం శరణం
జోనర్ : యాక్షన్ థ్రిల్లర్
సమర్పణ : సాయి శివాని
నిర్మాణ సంస్థ : వారాహి చలన చిత్రం
నటీనటు లు : నాగచైతన్య, లావణ్య త్రిపాఠి, శీకాంత్, రావు రమేష్, రేవతి, మురళీశర్మ, ప్రియదర్శి, శ్రీపవన్, రవివర్మ, సీమా చౌదరి తదితరులు.
కథ : డేవిడ్ ఆర్.నాథన్
మాటలు : అబ్బూరి రవి
స్క్రీన్ ప్లే : డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి
కళ : రామకృష్ణ
ఛాయాగ్రహణం : నికేత్ బమ్మిరెడ్డి
కూర్పు : కృపాకరన్
సంగీతం :వివేక్ సాగర్
లైన్ ప్రొడ్యూసర్ : కార్తికేయ
నిర్మాత : రజని కొర్రపాటి, సాయి కొర్రపాటి,
దర్శకత్వం : కృష్ణ ఆర్.వి.మారిముత్తు
విడుదల : 8-09-2017
రేటింగ్ : 2.75 / 5

ఈ ఏడాది ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’తో సహా వరుస విజయాలతో దూసుకెళ్తున్న  ప్రేమ కథల స్టార్‌ అక్కినేని నాగచైతన్య, ‘యుద్ధం శరణం’ సినిమాతో మరోసారి మాస్‌ హీరోగా మన ముందుకొచ్చాడు. ‘చై’ చిన్ననాటి స్నేహితుడు కృష్ణ ఆర్వీ మారిముత్తును దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి చలన చిత్రం బ్యానర్‌ పై వచ్చిన ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. నిన్నటి ఫ్యామిలీ హీరో శ్రీకాంత్‌ ఈ సినిమాతో విలన్‌ గా తదుపరి ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇన్ని విధాల హైప్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమా ‘యుద్ధం శరణం’ ఆ అంచనాలను అందుకుందా?  చైతన్య  మాస్‌ పాత్రలో ఎలా ఉన్నాడు? చూద్దామా!

కథేంటంటే? : ఇంజినీరింగ్‌ చదివినా ఉద్యోగం చేయకుండా డ్రోన్‌ తయారీ పనిలో తలమునకలై ఉంటాడు అర్జున్‌(నాగ చైతన్య). స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పేదలకు సేవలు అందించే సామాజిక స్పృహ గలిగిన వైద్యులు సీతాలక్ష్మీ (రేవతి), మురళీ కృష్ణ(రావు రమేష్‌) అతని తలిదండ్రులు. తలిదండ్రుల 30 వ పెళ్లి రోజును అక్కాబావలు, చెల్లెలు, స్నేహితులతో కలిసి సర్‌ప్రైజింగ్‌గా  సెలెబ్రేట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తాడు. తన తల్లి దగ్గరకు ట్రైనీగా వచ్చిన అంజలి (లావణ్య త్రిపాఠి)తో  ప్రేమలో పడ్డ అర్జున్‌, తన ప్రేమ విషయాన్ని తలిదండ్రుల వెడిరగ్‌ డే రోజున చెప్పి వాళ్లను ఒప్పించాలనుకుంటాడు. ఆలోపే అదే రోజు తలిదండ్రులు కనిపించకుండాపోతారు. మరోవైపు మూడు వేల కోట్ల రూపాయల స్కామ్‌ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రాష్ట్ర మంత్రి (వినోద్‌ కుమార్‌), కరడు గట్టిన కిరాయి డాన్‌ కనాయక్‌ (శ్రీకాంత్‌)ను వాడుకుని నగరంలో బాంఋ పెట్టించి విధ్వంసం సృష్టిస్తాడు. ఈ కేసు దర్యాప్తును అవినీతి పరుడైన ఎన్‌ ఐ ఎ అధికారి (మురళీశర్మ) చేపడతాడు. అర్జున్‌ తలిదండ్రుల కోసం వెతుకుతుండగా,  వారు యాక్సిడెంట్‌ లో చనిపోయారని తెలుస్తుంది. కానీ అది యాక్సిడెంట్‌ కాదని ఎవరో చంపేశారనే అనుమానంతో అర్జున్‌ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అదే సమయంలో అర్జున్‌ ఫ్యామిలీని చంపాలని  నాయక్‌ గ్యాంగ్‌, వెంటాడటం మొదలు పెడుతుంది.  వారి నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోడానికి పరుగులు తీస్తుంటాడు హీరో. వారిని నాయక్‌ ఎందుకు చంపాలనుకున్నాడు? బాంబ్‌ బ్లాస్ట్‌ కు, మురళీ దంపతులు కన్నుమూయడానికి, నాయక్‌కు ఉన్న సంబంధం ఏంటి? కేసులో ఎన్‌ఐఎ అధికారి అవినీతికి లోబడ్డాడా లేదా? నాయక్‌ నుంచి అర్జున్‌ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే : రాజకీయం`రౌడీయిజం లాలూచీ సంఘటనల్లో వారితో ఏమాత్రం సబంధం లేని ఒక సామాన్య కుటుంబం చిక్కుకుంటే, వారు ఎలాంటి పర్యవసానాను ఎదుర్కోవలసి వస్తుందీ అనే తెలిసిన కథనే ‘‘సరికొత్త కథనం’’గా అల్లుకున్న సినిమా ‘యుద్ధం  శరణం’. సస్పెన్స్‌ ఎలిమెంట్‌తో  స్క్రీన్‌ ప్లే ప్రధానంగా సాగే చిత్రమిది. సినిమా తొలి సగభాగం అందమైన కుటుంబం, హీరోహీరోయిన్‌  ప్రేమతో  నడుస్తుంది. అనుకోకుండా తల్లిదండ్రులు దూరమైతే ఓ యువకుడి జీవితంలో ఎదురైన సంఘర్షణను ఉద్యేగభరితంగా చూపించాడు దర్శకుడు. ద్వితీయార్ధంలో  విలన్‌`హీరో మధ్య ఘర్షణను సుదీర్ఘ డైలాగులతో కాకుండా సెర్చ్‌`యాక్షన్‌ ప్రధానంగా నడిపాడు. యాక్సిడెంట్‌కు గురై ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోయిన  ఒక గర్భవతికి డ్రోన్‌ సాయంతో హీరో అందించే రక్త రవాణా సీన్‌ ఆకట్టుకుంటుంది. అయితే కథ, కొన్ని సీన్‌లు కొన్ని వేరే సినిమాలను గుర్తుకు తెస్తాయి. స్వల్పంగా లాజిక్కులూ  మిస్‌ అయ్యాయి. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కలగటానికి బలమైన సన్నివేశాలు లేవు. నాయక్‌ పాత్రను ఒక రౌడీలాగా చూపిస్తూ, అతనికి క్రైమ్‌ వరల్డ్‌లో ఉన్న సంబంధాలను అత్యుక్తిగా చెప్పినట్లనిపించింది. కథనం పరంగా బాగున్నా, కథ విషయంలోనూ, పాత్ర ఎస్టాబ్లిష్‌మెంటులోనూ, విలన్‌ పాత్రను ఎస్టాబ్లిష్‌ చేసే  విషయంలోనూ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అలాగే సినిమాలో వేగం మరి కాస్త ఉండాల్సింది. నెగెటివ్‌ షేడ్‌ ఉన్న అవినీతి రాజకీయ నాయకుడిని, అవినీతిపరుడైన అధికారిని వదిలేయడం అంత సరిగ్గా అనిపించలేదు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ ను, అందమైన ఎగువ మధ్యతరగతి ఆనందాలను అందంగా చూపించడంలో కృతకృత్యుడయిన  డైరెక్టర్‌ కు మార్కులు పడతాయి. సినిమాటోగ్రాఫర్‌ నిఖేత్‌ బమ్మిరెడ్డి పనితనం బాగుంది. నైట్‌ విజన్‌ కెమెరాతో షూట్‌ చేసిన సన్నివేశాలు కొత్త అనుభూతినిస్తాయి. వివేక్‌ సాగర్‌ సంగీతం బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఎవరెలా చేశారంటే? : నాగచైతన్య ఎమోషనల్‌ సీన్స్‌లో ఒదిగిపోయి నటించాడు. ప్రేమ సన్నివేశాల విషయంలో చెప్పాల్సిన పనేముంది! లావణ్య త్రిపాఠి పాత్ర చిన్నదైనా బాగా చేసింది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ప్రతినాయక నాయక్‌ పాత్రలో శ్రీకాంత్‌ తన ఆహార్యం, కరుకైన ఎగ్రెసివ్‌ నటనతో సరికొత్తగా ఆకట్టుకున్నాడు. రావు రమేష్‌, రేవతి, మురళీశర్మ తమ తమ పాత్రల్లో  ఆకట్టుకుంటారు. వినోద్‌ కుమార్‌, రవివర్మ, శ్రీపవన్‌,  ప్రియదర్శి తన పాత్ర పరిధి మేరకు నటించారు. 

బలాలు: ప్రథమార్ధపు ఫ్యామిలీ ఎమోషన్స్` వినోదం, యాక్షన్ థ్రిల్లింగ్ సీన్స్
బలహీనతలు: పాత కథ, స్లో నెరేషన్, పాటలు
ముక్తాయింపు: నాగ చైతన్యను ఎమోషన్, యాక్షన్‌లో చూపించే కథనం

 

 

SHARE