Saturday November 17, 2018
మేడ మీద అబ్బాయి సినిమా రివ్యూ - Tollybeats

మేడ మీద అబ్బాయి సినిమా రివ్యూ

Updated | September 9, 2017 15:36 IST

చిత్రం: మేడ మీద అబ్బాయి
జోనర్: థ్రిల్లర్ డ్రామా
నిర్మాణ సంస్థ: జాహ్నవి ఫిలిమ్స్
నటీనటులు: అల్లరి నరేష్, నిఖిలా విమల్, శ్రీనివాస్ అవసరాల, జయ ప్రకాష్, సత్యం రాజేష్, హైపర్ ఆది.. తుసి తదితరులు
కథ: వినీత్ శ్రీనివాసన్
ఛాయాగ్రహణం: ఎస్.శివకుమార్
ఎడిటింగ్: నందమూరి హరి
సంగీతం: షాన్ రెహమాన్
నిర్మాత: బప్పన్న చంద్రశేఖర్
దర్శకత్వం: జి.ప్రజీత్
విడుదల తేదీ: 08-09-2017
రేటింగ్: 2 / 5

యువ హీరోల్లో అత్యధిక సినిమాలు చేసి కూడా గత కొంత కాలంగా సరైన హిట్లు లేని అల్లరి నరేష్‌, మళయాళంలో హిట్‌ అయిన ‘ఒరు ఒక్కడన్‌ సెల్ఫీ’ తెలుగు రీమేక్‌లో నటించిన చిత్రం ‘మేడమీది అబ్బాయి’. మాతృక దర్శకుడు ప్రజీత్‌కే ఇక్కడి నిర్మాతలు జాహ్నవి ఫిలిమ్స్‌ వారు దర్శకత్వ బాధ్యతలు చే పెట్టారు. దీంతో అల్లరి నరేశ్‌ సినిమాను ఇష్టపడే హాస్య ప్రియులు, కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ రీమేక్‌తో నరేశ్‌ పూర్వ వైభవం అందుకున్నాడా? అసలు సినిమా ఎలా ఉందీ? అనేది తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే!

కథేంటంటే?: ఆన్‌లైన్‌ ప్రేమలతో మోసపోతున్న యువతుల ఉదంతాలను, అమ్మాయిలు`అబ్బాయిల పరచయాలు సెల్ఫీలగా మారితే పర్యవసానాలను కథగా మార్చుకున్న సినిమా ఇది. జీవితం అంటే సీరియస్‌నెస్‌ లేని శీను(అల్లరి నరేష్‌)ను, మధ్య తరగతికి చెందిన అతని తల్లిదండ్రులు అప్పు చేసి ఇంజనీరింగ్‌ చదివిస్తారు. చదువునూ సీరియస్‌గా తీసుకోని శీను 24 సబ్జెక్ట్స్‌ ఫెయిలై ఊళ్లోని తమ ఇంటికి చేరతాడు. తల్లిదండ్రుల వేదనను, తిట్లనూ కూడా పట్టించుకోకుండా శ్రీను స్నేహితులతో కాలక్షేపం చేస్తూ అమ్మాయిలకు సైట్‌ కొడుతుంటాడు. చదువు లేకపోయినా సినిమా డైరెక్టర్‌ అవుతానంటూ స్నేహితులతో కలసి షార్ట్‌ ఫిల్మ్‌ తీసేందుకు విఫలయత్నం చేస్తాడు. తమ ఇంటి పక్కకు అద్దెకు వచ్చిన బ్యాంక్‌ మేనేజర్‌ కూతురు సింధు(నిఖి)ని చూసి ఇష్టపడతాడు కానీ ఆమె మాత్రం ఇతని వైపు కూడా చూడదు. తన స్నేహితుల దగ్గర గొప్ప కోసం ‘సింధు నాకు పడిపోయింది.. మేమిద్దరం ప్రేమించుకొంటున్నాం’ అని చెప్పుకుంటాడు. తండ్రి (జయ ప్రకాష్‌) చెప్పే మంచి మాటలు భరించలేక, సినిమా డైరెక్టర్‌ అవుతానంటూ ఓ రోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్‌ బయల్దేరతాడు. అదే రైలు లో కనిపించిన సింధుతో మాటలు కలిపి, ఆమెకి తెలియకుండా ఆమెతో సెల్ఫీ దిగి ఊళ్లోని తన స్నేహితులకు పంపుతాడు. వారం రోజుల హైదరాబాద్‌ అంతా తిరిగి, సినిమా అవకాశాలు అంత ఈజీగా రావని తెలుసుకుని తిరిగి ఊరికి వస్తాడు. అప్పటికే కనపడకుండా పోయిన సింధును, శ్రీనుయే లేపుకుపోయాడని సెల్ఫీవల్ల భ్రమపడిన ఊరి పెద్దలు నిలదీస్తారు. దీంతో ఆమెని వెతికేందుకు తన ఫ్రెండ్‌ బాబ్జీ(హైపర్‌ ఆది)తో కలిసి మళ్లీ హైదరాబాద్‌ పారిపోతాడు. ఈ క్రమంలో అమ్మాయిలను ఎత్తుకెళ్లే ఒక సెక్స్‌ రాకెట్‌తో శ్రీనుకి సంబంధం ఉన్నట్లు వార్తలు వస్తాయి. సింధుని వెతికి పట్టుకెళితే తప్ప తనపై పడిన కళంకం చెరిగిపోదని భావించి ఆమెని వెతుకుతుండగా, ప్రైవేట్‌ డిటెక్టివ్‌ యుగంధర్‌ (శ్రీనివాస్‌ అవసరాల) తారసపడతాడు. ఈ దశలో కనపడిన సింధు, తను ఆన్‌లైన్‌ పరిచయంతో ప్రేమించిన యువకుడి కోసం వచ్చినట్లు చెప్పి, అతన్ని కలిసేంతవరకు తిరిగి రానంటుంది. ఇక అతని కోసం వెతకడం మొదలు పెడతారు. ఆమె ప్రేమించినది ఎవరిని? అతను దొరికాడా? శ్రీను కేసు నుంచి బయటపడ్డాడా? శ్రీను ప్రేమ ఏమైందీ అనేవి తెరపై చూడాల్సిందే!

ఎలా ఉందంటే?: కథగా చూస్తే ఆసక్తికరంగానే ఉన్నా కథనం ఆ స్థాయిలో ముందుకు సాగలేదు. కథలో మలుపులకు చోటున్నా  అంత ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు దర్శకుడు. కథ ప్రారంభం, హీరో పరిచయం, కాలేజీ వ్యవహారాలు, స్నేహితులతో షార్ట్‌ఫిల్మ్‌ ఇవన్నీ పైపైన సాగాయి. సెల్ఫీ దగ్గర్నుంచి కథ మలుపు తిరుగుతుంది. సెకండాఫ్‌ మొత్తం సాగే అన్వేషణను ఆసక్తికరంగా మలుచుకోలేకపోయారు. చివర్లో వచ్చే ట్విస్టు కాస్త కొత్తగా అనిపిస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్‌, ముగింపు, కథనంలో బిగువులేకపోవడం లోపాలు. అల్లరి నరేశ్‌ నుంచి ఆశించే నవ్వులు పెద్దగా ఉండవు. హైపర్‌ ఆది మోతాదు మించిన పంచ్‌డైలాగ్‌లతో ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నం అంతగా ఫలించలేదు. ద్వితీయార్ధంకథనం సాగదీసినట్లు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ను కూడా సరిగ్గా రాసుకోలేదు. సినిమా ముగింపుకొచ్చే సమయంలోనైనా వారి మధ్య కాస్త అనురాగం పెరిగే సీన్లు రాసుకోలేదు. కథనంలో భావోద్వేగాలకు అవకాశం ఉన్నా, ఒకటి రెండు చోట్ల తప్ప వాడుకోలేకపోయారు. హీరో క్యారెక్టరేషన్‌కి సరిగ్గా ముగింపు ఇవ్వకపోవడం మరో లోపం. దర్శకుడిగా ప్రజీత్‌ ప్రయత్నం బాగున్నా, అంత మెరుగ్గా లేదు.షాన్‌ రహమాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అంత బాగాలేదు. కథానాయకుడి గురించి వచ్చే తొలి పాట మ్యూజిక్‌ బీట్‌ ఆకట్టుకొంటుంది. ఉన్ని ఎస్‌.కుమార్‌ సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్‌ ఒకె. జాహ్నవి ఫిలిమ్స్‌ బప్పన్న చంద్రశేఖర్‌ నిర్మాణ విలువలు బడ్జెట్‌ రీత్యా బాగానే ఉన్నట్లే లెక్క.

ఎవరెలా చేశారంటే?: కేవలం స్పూఫ్‌లు, ఇమిటేషన్‌లు కాకుండా అలాగే పూర్తి కామెడీ కాకుండా.. కామెడీ, సీరియస్‌నెస్‌ కగలిసిన పాత్ర చేశాడు అల్లరి నరేష్‌ ఈ చిత్రంలో. ఆ రీత్యా మొత్తంగా బాగా చేసినా, నటనలో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఇంకాస్త రావాల్సి ఉంది. నిఖిలా విమల్‌ డీసెంట్‌ లుక్‌తో పెర్ఫామెన్స్‌ పరంగానూ ఓకే. అవసరాల శ్రీనివాస్‌, జయప్రకాష్‌, తులసి, శివారెడ్డి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. హైపర్‌ ఆది నటనలో సినిమాకు అడాప్ట్‌ కావలసి ఉంది. 

బలాలు: కథలోని పాయింట్, ముగింపు ట్విస్ట్, ఒక మాదిరి కామెడి
బలహీనతలు: కథనంలో తగ్గిన బిగువు, సాగదీత, శృతి మించిన పంచ్ కామెడి
ముక్తాయింపు: అంత మంచిగా.. అంత కొంటెగా లేని ‘మేడమీద అబ్బాయి’

 

SHARE