Thursday January 18, 2018
నాకూ అవేమి కొత్త కాదు.. ప్రియాంక చోప్రా - Tollybeats

నాకూ అవేమి కొత్త కాదు.. ప్రియాంక చోప్రా

Updated | December 28, 2017 11:57 IST

దిల్లీ: ఈ ఏడాది మీటూ హ్యాష్‌ట్యాగ్‌తో ఎంతో మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి గళం విప్పారు. ఇప్పుడు ఆ జాబితాలోకి బాలీవుడ్‌ భామ ప్రియాంక చోప్రా చేరింది. కొందరు అధికార గర్వంతో తనను అణగదొక్కాలని ప్రయత్నించినట్లు ఆమె తెలిపారు.

పెంగ్విన్‌ 11వ వార్షిక సదస్సులో ‘బ్రేకింగ్‌ ద గ్లాస్‌ సీలింగ్‌: చేజింగ్‌ ఎ డ్రీమ్‌’ అనే అంశం మీద ప్రియాంక మాట్లాడుతూ.. ‘నేనేప్పుడూ లైంగిక వేధింపులకు గురి కాలేదు. కానీ అధికార గర్వంతో కొందరు నాతో ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని ప్రయత్నించారు. చాలా సందర్భాల్లో నేను సంతకం చేసిన సినిమా నుంచి చివరి నిమిషంలో నన్ను తొలగించారు. సిఫార్సుల వల్ల నా స్థానంలో వేరే వాళ్లను తీసుకున్నారు. ఆ సమయంలో నేను ఏమీ చేయలేని పరిస్థితి. కానీ అలాంటి వారి అధికార దాహానికి నేనెప్పుడు భయపడలేదు. నన్ను గౌరవించిన నా సహచరులు, స్నేహితులతోనే నేను సన్నిహితంగా ఉన్నాను. ఇదంతా నా కుటుంబం నాకందించిన సహకారం వల్లే సాధ్యమైంది’ అని ప్రియాంక వెల్లడించారు.

మన ఆచార వ్యవహారాలకు అనుగుణంగానే వ్యవహరించాలని, వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు తనను వేధించాడని హాలీవుడ్‌ హీరోయిన్‌ మెరిల్‌ స్ట్రీప్‌ బయటపెట్టడంతో పాటు అతనికి వ్యతిరేకంగా కొన్ని వస్తువులు శ్వేతసౌధం ఎదురుగానే అమ్మకానికి పెట్టారు. ఇదంతా మన దగ్గర సాధ్యం కాదు’ అని ఆమె ఈ సందర్భంగా అన్నారు. ఈ ఏడాది అనేక మంది హాలీవుడ్‌ కథానాయికలు తమ వృత్తి జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయట పెట్టిన విషయం తెలిసిందే. వారిలో ఎక్కువ మంది నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌ బాధితులే. ‘మన భవిష్యత్తు తరాలకు స్త్రీలను గౌరవించాలని చెప్పడం మూలంగానైనా పరిస్థితి మారుతుందని ఆశిద్దాం’ అని ప్రియాంక సూచించారు.

SHARE