Sunday January 21, 2018
తమిళనాడు ఎమ్మెల్యేలకు భారీగా జీతాలు పెంపు - Tollybeats

తమిళనాడు ఎమ్మెల్యేలకు భారీగా జీతాలు పెంపు

Updated | January 10, 2018 18:18 IST

న్యూఢిల్లీ: జీతాలు పెంచాలంటూ వారం రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న తమిళనాడు ఆర్టీసీ కార్మికులకు అక్కడి ప్రభుత్వం షాకిచ్చింది. ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్లను పక్కనబెట్టి... ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్సులు పెంచాలంటూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఆమోదం పొందితే రేపటినుంచే తమిళనాడు ఎమ్మెల్యేలకు భారీగా జీతాలు ముట్టునున్నాయి. ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే డీఎంకేతో పాటు అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. డీఎంకే నేత ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యేల జీతాలు పెంచడం చూసి ప్రజలు నవ్వుకుంటారు.. జీతాలు పెంచాలంటూ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా ఇవేం పనులు?.. ’’ అంటూ నిలదీశారు.

తమ నెలవారీ జీతాలు పెంచాలనీ, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ఆర్టీసీ కార్మికులు గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. పండుగ సమయంలో నిరవధిక సమ్మె చేపట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2.57 రెట్లు జీతాలు పెంచాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తుండగా... సీఎం ఎడప్పాడి మాత్రం 2.44 రెట్లు మాత్రమే పెంచుతామంటూ వెల్లడించారు. ఇందుకు కార్మిక సంఘాలు ససేమిరా అంటున్నాయి. వామపక్షాలు, డీఎంకే అనుబంధ సంఘాలు సహా మొత్తం 17 కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.

SHARE