Tuesday October 23, 2018
జై లవకుశ సినిమా రివ్యూ - Tollybeats

జై లవకుశ సినిమా రివ్యూ

Updated | September 21, 2017 21:08 IST

చిత్రం: జై లవకుశ
జానర్: సోషల్ ఎమోషనల్ డ్రామా
నిర్మాణ సంస్థ: నందమూరి తారక రామారావు ఆర్ట్స్ (ఎన్టీఆర్ ఆర్ట్స్)
నటీనటులు: జూ॥ ఎన్టీఆర్, రాశీఖన్నా, నివేదా థామస్, సాయికుమార్, పోసాని కృష్ణమురళీ, ప్రదీప్ రావత్, బహ్మాజీ, జయప్రకాష్రెడ్డి తదితరులు
రచన: బాబి, కోన వెంకట్, కె.చక్రవర్తి
కళ: ఎ.ఎస్.ప్రకాష్
ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: నందమూరి కల్యాణ్రామ్, నందమూరి హరికృష్ణ
దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర (బాబి)
విడుదల తేదీ: 21-09-2017
రేటింగ్: 3 / 5

టెంపర్‌ నుంచి జనతా గ్యారేజ్‌ వరకు హ్యాట్రిక్‌ హిట్స్‌ నమోదు చేసుకున్న జూ॥ఎన్టీఆర్‌, ఇప్పుడు బిగ్‌ బాస్‌ షో తోనూ బుల్లి తెరపై అలరిస్తూ మంచి  రేటింగ్‌తో ముందున్నాడు. ఇప్పుడు వరుసగా రెండో హ్యాట్రిక్‌ పై కన్నేసిన తారక్‌, తన సోదరుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ నిర్మించిన జై లవ కుశ లో నటించాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి పాలుపంచుకున్న ఈ సినిమాలో జూనియర్‌ ఎన్‌టిఆం తొలిసారి త్రిపాత్రాభినయం చేయడంతో సినిమాపై తొలి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. అంతే కాక ఎన్‌టిఆర్‌ ఒక పాత్రలో విలన్‌ షేడ్‌లో కూడా నటించగా, ట్రైలర్‌ లో ఆ పాత్ర పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. కోటిన్నర దాటిన ట్రైలర్‌ వ్యూస్‌తో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుండగా నేడు విడదలయింది. ఎన్‌టిఆర్‌ ఈ సినిమాలో  మూడు పాత్రలలో ఎలా మెప్పించాడు? మొత్తంగా సినిమా ఎలా ఉందీ? అనేది తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కథేంటంటే?: చిన్నతనంలో విడిపోయిన అన్నదమ్ముల సినిమాలు మనకు తెలుసు. వారి మధ్య చిన్న నాటి పగ నేపథ్యాన్ని తీసుకుని కొత్త కోణంలో అల్లుకున్న కథ ఇది. తెలుగునాట రామచంద్రపురం అనే గ్రామంలో జై, లవ, కుశలు ఒకే పోలికలున్న సోదరులు. బాల్యంలో మేనమామ(పోసాని కృష్ణమురళి) వారితో నాటకాలు వేయిస్తూ , పెద్దవాడు అయిన జై కి నత్తి ఉన్నదన్న కారణంతో అతడికి సరైన పాత్రలు ఇవ్వక పోగా అవమానిస్తుంటాడు. తెలిసీ తెలియక లవ, కుశలూ  అలాగే వ్యవహరిస్తుంటారు. దీంతో, రావణ పాత్ర ప్రేరణతో వారిపై ద్వేషం పెంచుకున్న జై, అగ్ని ప్రమాదం సృష్టించి వారిని చంపాలనుకుంటాడు. అయితే ముగ్గురూ ఆ ప్రమాదం నుంచి బయటపడి వేర్వేరు చోట్ల పెద్ద వారు అవుతారు.  హైదరాబాద్‌లో లవుడు ఒక ఫైర్‌ ఆఫీసర్‌ పెంపకంలో బ్యాంక్‌ మేనేజరుగా, జైలులో పెరిగిన కుశుడు దొంగగా,  జై మాత్రం ఒరిస్సాలోని బైరంపూరులో ఫ్యాక్షనిస్ట్‌ తరహా డాన్‌గా మారతారు. లవుడి మంచితనాన్ని అలుసుగా తీసుకొని అవినీతిపరులైన కొందరు సాటి ఉద్యోగులు, దొంగ కస్టమర్లు మోసం చేస్తారు. అతను ప్రేమించిన ప్రియ(రాశీ ఖన్నా) నో చెప్తుంది. దొంగిలించిన కోటి రూపాయలతో అమెరికా పారిపోయి అక్కడ దొంగగా సెటిల్‌ అవుదామనుకున్న కుశుడు, నోట్ల డీ మోనటైజేషన్‌తో నోట్లు చెల్లక డిప్రెస్‌ అవుతాడు. ఆ తరుణంలో వీరిద్దరూ  తారసపడతారు. పరస్పరం గుర్తు పడతారు. లవుడు బదులు బ్యాంకులో పని చేస్తూ అతన్ని సమస్య నుంచి గట్టెక్కిస్తానని నమ్మించి, ఒక దొంగ కస్టమర్‌ నుంచి రు.5 కోట్లు లాగేస్తాడు కుశుడు. తర్వాత ఉడాయిస్తాడు. కానీ డబ్బులు కనపడవు. ఆ తరుణంలో ప్రియ, లవుడి ప్రేమను అంగీకరించగా, ఆమె కూడా కనపడకుండా పోతుంది. ఈ క్రమంలో లవకుశలు కూడా కిడ్నాప్‌ అవుతారు. వారిని జై నే కిడ్నాప్‌ చేయించినట్లు తెలుస్తుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధించడం, ఒకమ్మాయి ప్రేమను పొందడం.. అనే రెండు పనులను వారి ద్వారా నెరవేర్చుకుని ఆపై వారిద్దరినీ చంపేయాలనుకుంటాడు జై. ఈ క్రమంలో లవుడు అన్న  ప్రేమను తిరిగి పొందాలనుకోగా, కుశుడేమో జై ని చంపైనా తిరిగి వెళ్లి పోవాలనుకంటాడు. అప్పుడేం జరిగింది? పగబట్టిన జై ప్రత్యర్ధులు ఏం చేశారు? ప్రత్యర్థులపై  జై   పైచేయి సాధించాడా? సోదరులపై తన కక్ష తీర్చుకున్నాడా? లేదా ముగ్గురు అన్నదమ్ములు కలిశారా? అనేది వెండితెర మీద చూడాల్సిందే. 

ఎలా ఉందంటే?: కథగా చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేకపోయినా, పాత్రలు రూపొందించిన తీరు, ఒకింత మెలో డ్రామాతో ఈ కథను నడిపించడంలో దర్శకుడు బాబీ సక్సెస్‌ అయ్యారు. కథను, సీన్‌లను, మాటలను సాగదీత లేకుండా చక్కగా రాసుకున్నాడు. ముఖ్యంగా జై, లవ, కుశ పాత్రలను బ్యాలెన్స్‌ చేయడం బాగుంది. బహుముఖంగా నటించగల నేర్పున్న హీరో కోసం తయారు చేసుకున్నట్లు కనిపిస్తున్న ఈ కథ, జూ॥ఎన్టీఆర్‌ నట పరిణతిపై నడిచిందనడం అతిశయోక్తి కాదు.  రెండుంపావు గంటల నిడివిలో మూడు పాత్రలలో నటవిశ్వరూపంసాక్షాత్కారమవుతుంది. తన నటన, డైలాగులు, వినోదం, డాన్సులతో తారక్‌ రక్తికట్టించాడు. రైతుల గురించి, బ్యాంకుల గురించి ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగులు బాగున్నాయి. అయితే కథ పరంగా.. చిన్నతనంలో మేనమామ, జై ని పెద్ద కారణం లేకుండానే అవమానించడం ప్రేమగా చూసే అన్న జై ని తమ్ముళ్లు లవ కుశలు కూడా దూరం పెట్టడం, జై డాన్‌గా ఎదిగిన తీరు.. సినిమాటిక్‌గా అనిపిస్తాయి. మిగతా అంతా ఒక ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గానూ, ఎమోషనల్‌ డ్రామాగానూ కథనం రక్తి కట్టింది. సస్సెన్స్‌ లేకుండా ఫ్లాట్‌  స్క్రీన్‌ ప్లేతో, చిన్న చిన్న ట్విస్ట్‌లతో నడవడం, కావాలని కామెడీ డైలాగులు, ట్రాకులు పెట్టకుండా సందర్భాను సారంగా వినోదం నడపడం బాగున్నాయి.  అలాగే పాటలనూ సందర్భానుసారంగా వాడారు.  తక్కువ పాటలే అయినా చక్కగా కుదిరాయి. మొత్తంగా చూసినప్పుడు దర్శకుడు బాబీ, సాధారణ ప్రేక్షకులను సైతం అలరించేలా సినిమాను తీశాడనడం నిస్సందేహం. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. కోన మాటలు, ప్రకాశ్‌ ఆర్ట్‌, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫి, పాటల్లో, నేపథ్యంలోనూ దేవిశ్రీ సంగీతం సినిమాకు బలాలుగా మారాయి. 

ఎవరెలా చేశారంటే?:  మూడు పాత్రలలో వేరియేషన్స్‌ చూపడమే కాక నెగిటివ్‌ పాత్ర అయిన జై ఆహార్యం, నటనలో జూనియర్‌ ఎన్‌టిఆర్‌ అద్భుతంగా రాణించాడు. హీరోయిన్స్‌గా నటించిన నివేద థామస్‌, రాశిఖన్నాలు పాత్రల్లో నటనకు స్కోప్‌ తక్కువగా ఉన్నా బాగానే చేశారు. ఇక సాయికుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, రోనిత్‌ రాయ్‌, అభిమన్యుసింగ్‌, ప్రదీప్‌ రావత్‌ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఒక పాత్రలో హంసా నందిని, ఒక పాటలో తమన్నా గ్లామర్‌ను అద్దారు.

బలాలు: కథలో కొత్త కోణం, ఆకట్టుకునే సీన్స్, ఎమోషన్స్, హాస్యం, ఎన్టీఆర్ నటన,డాన్సులు
బలహీనతలు: కథ విస్తృతి తక్కువ, పాత్రలతోనే కథ నడవడం, సెకండాఫ్ ఒకింత స్లో నెరేషన్
ముక్తాయింపు: అభిమానులను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే జూ॥ ఎన్టిఆర్ విశ్వరూపం

 

 

 

SHARE