Saturday November 17, 2018
ఉంగరాల రాంబాబు సినిమా రివ్యూ - Tollybeats

ఉంగరాల రాంబాబు సినిమా రివ్యూ

Updated | September 15, 2017 20:27 IST

చిత్రం: ఉంగరాల రాంబాబు
జానర్ : కామెడీ ఎంటర్టైనర్
నిర్మాణ సంస్థ: యునైటెడ్ మూవీస్ లిమిటెడ్
నటీనటులు: సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, పోసాని కృష్ణమురళి, ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్ర, దువ్వాసి మోహన్, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, తదితరులు.
మాటలు: చంద్రమోహన్ చింతాడ
కళ: ఎ.ఎస్.ప్రకాష్
ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం: గిబ్రాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, రెహమాన్
నిర్మాత : పరుచూరి కిరిటీ
కథ, దర్శకత్వం : క్రాంతి మాధవ్
విడుదల తేదీ: 15-09-2017
రేటింగ్: 2/5

సీరియస్‌ కథల్లోనూ  కామెడీని పంచగలిగే హీరో సునీల్‌, ఇటీవల ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో సరైన కథను ఎంచుకోలేకపోతున్నాడనే మాటా వినిపిస్తున్నది. ఈ దశలో  ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న క్రాంతిమాధవ్‌ సునీల్‌ హీరోగా తెరకెక్కించిన సినిమా ఉంగరాల రాంబాబు. టైటిల్‌తో సహా వీరిద్దరి కాంబినేషన్‌ పై కూడా ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. క్రాంతి మాధవ్‌ సునీల్‌తో ఎంత వినోదాన్ని పంచాడు?ఉంగరాల రాంబాబుగా సునీల్‌ ఎలా అలరించాడు? తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే!

కథేంటంటే: ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి హీరో, ఆ అమ్మాయి  తండ్రి మనసును ఎలా గెలుచుకున్నాడనే పాత పాయింటుకు కొత్త నేపథ్యాన్ని తీసుకుని అల్లుకున్న కథ ఇది.  గారాబంగా పెరిగిన యువకుడు రాంబాబు (సునీల్‌) తన తాత చనిపోవడంతో 200 కోట్ల ఆస్తిని కోల్పోయి రోడ్డున పడతాడు. జనాన్ని మాయ చేసి బతికే బాదం బాబా (పోసాని కృష్ణమురళి) ఆశ్రయిస్తాడు. ఆ బాబా, నోటికొచ్చింది ఏదో చెప్పగా, అతను చెప్పినట్లు ఒక బాదం చెట్టును నాటుతుండగా, భూమిలో రు200 కోట్ల బంగారం దొరుకుతుంది. అప్పటి నుంచి బాబాను నమ్మి అతను చెప్పినట్లు ఉంగరాలు ధరిస్తుంటాడు. చికుబుకి నక్షత్ర జాతకం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని  ఇచ్చిన సలహాతో తన మేనేజర్‌ సావిత్రి (మియా జార్జ్‌) ది అదే జాతకమని తెలిసి ప్రేమిస్తాడు. ఆమె తండ్రి అంగీకారం కోసం కొచ్చిన్‌ వద్ద గ్రామానికి వెళతాడు. కమ్యూనిస్ట్‌ అయిన ఆమె తండ్రి రంగనాయర్‌ ( ప్రకాశ్‌ రాజ్‌)కి క్యాపిటలిస్ట్‌ అయిన రాంబాబు నచ్చడు. దొంగ కమ్యూనిస్ట్‌ అయిన లెనిన్‌ సుధాకర్‌(వెన్నెల కిశోర్‌)కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో.. తను పాతర పెట్టిన బంగారం రాంబాబుకు దొరికిందని తెలుసుకుని విలన్‌ ( ఆశిష్‌ విద్యార్థి) అతన్ని వెతుక్కుంటూ కేరళ వస్తాడు. అప్పుడేమైందనేది మిగతా కథ. వాళ్లిద్దరి ప్రేమకథ సఫలమైందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: కథగా బాగున్నా కథనం బిగువుగా సాగలేదనే చెప్పాలి. ఏ సన్నివేశాన్నీ దర్శకుడు బలంగా రాసుకోలేదేమో అనిపిస్తున్నది. కథలో హాస్యానికి ఎంతో అవకాశమున్నా  సన్నివేశాలను ఆ విధంగా రాసుకోలేకపోయారు. లాజిక్‌ లేని, అవసరం లేని సన్నివేశాలూ ఉన్నాయి. కథలో ఏ రసంలోనూ ఉద్యేగాలు సరిగ్గా పండలేదు. అందరికీ సమతను, మమతను ఇచ్చే కమ్యూనిజాన్ని తక్కువ గా చూపేందుకు హ్యూమనిజం పేరుతో ఒకరిద్దరికి సాయం చేసే పాత పద్ధతునే హీరోని ఎలివేట్‌ చేయడానికి వాడుకోవడం కొత్తగా లేదు. పెద్దగా ఆకట్టుకోలేదు. సునీల్‌ నటనతో పాటు తనదైన ఈజ్‌తో డ్యాన్సులు కూడా బాగా చేసినా ఉపయోగం లేకుండా పోయింది. వ్యవసాయం కూడా ఒక ఇండస్ట్రీయే అంటూ హీరోతో చెప్పించిన డైలాగులు బాగున్నాయి. గిబ్రాన్‌ నేపథ్య సంగీతం అంత బాగా లేదు. సినిమాటోగ్రఫి  ఒక మాదిరిగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడి గత చిత్రాల ప్రభావంతో అంచనాలు పెట్టుకున్న  ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారనే చెప్పాలి.

ఎవరెలా చేశారంటే?: సునీల్‌ నటన, డ్యాన్సులు ఒకె. మియా జార్జ్‌ హుషారుగా నటించింది. కానీ పాత్రలో స్కోప్‌ తక్కువ.  ప్రకాష్‌రాజ్‌, వెన్నెల కిశోర్‌లు పాత్ర పరిధి మేరకు చేశారు. పోసాని, వేణు, ఆశిష్‌ విద్యార్థి, రాజీవ్‌ కనకాల ఒకె. 

బలాలు: సునీల్ డ్యాన్సులు, అక్కడక్కడా కాస్త హాస్యం
బలహీనతలు: బిగువు, కొత్తదనం లేని సన్నివేశాలు,కథనం, సంగీతం
ముక్తాయింపు: మెరవని ఉంగరాలతో రాంబాబు

SHARE