Saturday November 17, 2018
అర్జున్ రెడ్డి సినిమా రివ్యూ - Tollybeats

అర్జున్ రెడ్డి సినిమా రివ్యూ

Updated | August 25, 2017 20:03 IST

సినిమా : ‘అర్జున్ రెడ్డి’
జానర్ : లవ్ అండ్ రొమాంటిక్ డ్ర్రామా
నిర్మాణ సంస్థ : భద్రకాళి ఫిక్చర్స్
తారాగణం : విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ, జియాశర్మ, కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, అమిత్ తదితరులు
ఛాయాగ్రహణం : రాజ్ తోట
కూర్పు : శశాంక్
సంగీతం : రధన్
నిర్మాత : ప్రణయ్ రెడ్డి వంగా
దర్శకత్వం : సందీప్ రెడ్డి వంగా 
విడుదల తేదీ : 25.8.2017
రేటింగ్ : 2.75 / 5

పోస్టర్‌పై లిప్‌లాక్‌ ముద్దు సన్నివేశాలతో విడుదలకు ముందే వివాదాలను ఎదుర్కొన్న సినిమా అర్జున్‌రెడ్డి. రాజకీయనాయకులు, మహిళాసంఘాలు కూడా దీనిపై అభ్యంతరపెట్టి పబ్లిసిటీ కల్పించాయి. చిత్ర హీరో విజయ్‌ దేవర కొండ ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పడం కూడా పబ్లిసిటీ స్టంటా? లేదా సినిమాకు అంత సీన్‌ ఉందా? అని చర్చించుకునేలా చేసింది. ఇలా వివాదాల నడుమ నేడు  ప్రేక్షకుల ముందుకొచ్చింది.దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తొలి చిత్రం కూడా అయిన  అర్జున్‌రెడ్డి,  ద్వారక పరాజయంతో ఉన్న పెళ్లిచూపులు హీరో విజయ్‌సాయి దేవరకొండకి విజయాన్ని అందించిందా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే!

కథేంటంటే? : ఇద్దరు ప్రేమించుకోవడం, అంగీకరించని ఆమె తలిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం,హీరో విరహంతో విరాగిగా మారడం.. దేవదాసు నుంచి ఉన్న ప్రేమ కథే.తనలోని తీవ్ర ఆవేశమే తన ప్రేమను వ్యతిరేకదిశలో ప్రభావితం చేయగా ఇలాంటి వియోగ పరిణామాలు సంభవించడాన్ని అంతర్గత పాయింటుగా తీసుకుని అల్లుకున్న కథనమే అర్జున్‌ రెడ్డి.స్వతంత్ర భావాలకు తోడు ఎవరినీ లెక్క చేయని తనం, ఆవేశం కగలిసిన హైదరాబాద్‌కు చెందిన అర్జున్‌ రెడ్డి ( విజయ్‌ దేవరకొండ) మంగళూరులో టాప్‌ ర్యాంక్‌ మెడికల్‌ స్టూడెంట్‌హైదరాబాద్‌కే చెందిన కన్నడిగురాలు తన జూనియర్‌  ప్రీతి శెట్టి( షాలిని పాండే) ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు.ఫోర్స్‌గా ఉండే తన తీరుతో  ప్రీతిని ప్రేమలో పడేస్తాడు. ఆమె బ్యాచిలర్‌ డిగ్రీ, అతను మసూర్‌ మాస్టర్స్‌ పూర్తి చేసే క్రమంలో ఇద్దరూ అన్ని విధాలా దగ్గరవుతారు. హైదరాబాద్‌ వచ్చాక ఆమె తండ్రి వాళ్ల ప్రేమకు ‘నో’ చెప్పగా,అర్జున్‌ విపరీత ఆవేశానికి లోనయి,ఆయనను తూలనాడటమే కాక, ఆరు గంటల్లోగా ఏదొకటి తేల్చేయాలని ఆమెకి షరతు పెడతాడు.అతని కోసం వచ్చిన ఆమె, మద్యంతో పాటు మాదకద్రవ్వాలు తీసుకున్న అతన్ని కలవలేకపోతుంది.అతను కోమాలోకి వెళ్లిన రెండురోజుల్లోనే ఆమె తండ్రి ప్రీతికి వేరే పెళ్లి చేస్తాడు.ప్రీతి దూరమైన అర్జున్‌ డిప్రెషన్‌ లోకి వెళ్లి, విపరీతంగా ప్రవర్తించడంతో అతని తండ్రి ఇంటి నుంచి వెళ్ల గొడతాడు.ఇంటి నుంచి బయటకు వచ్చేసి డాక్టర్‌గా జాబ్‌ చేస్తూనే చెడు వ్యసనాలకు బానిసవుతాడు.కోపం, వ్యసనాల కారణంగా డాక్టర్‌ వృత్తికి కూడా దూరమవుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అర్జున్‌ రెడ్డి తిరిగి కోలుకున్నాడా? అతడి ప్రేమ ఏమయిందీ అనేదే మిగతా కథ.

కథనం ఎలా ఉందంటే? : కథను కాకుండా కథనాన్ని నమ్ముకుని తెరకెక్కించిన సినిమా ఇది.బలీయమైన ప్రేమలోని భావోద్వేగాలను అంతే భావోద్వేగంగా.. అప్‌ టూ డేట్‌గా తెరపైకి తెచ్చిన సినిమా అర్జున్‌రెడ్డి, సెకండాఫ్‌లో మాత్రం ఏమి చెప్పాలో తెలియక తడబడి సాగదీతకు గురయింది.సన్నివేశాలను చాలా వరకు రియలిస్ట్‌గా బోల్డ్‌గా రాసుకుని,వాటిని అదే స్థాయిలో తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు.ఆ వాస్తవికతలో..అక్కడక్కడా అడపాదడపా ‘అతి’ గా, షాకింగ్‌గా అనిపించడం చిన్న లోపం.అంతేకాక సామాజికమైన కొన్ని అంశాల్లో లాజిక్‌ తప్పిన భావన వచ్చింది. ఎగువ మధ్య తరగతికి చెందిన హీరోయిన్‌ తండ్రి.. హీరో, అతని తలిదండ్రులు కులీన స్థాయి తెలిసి కూడా కేవలం వేరే కులం (వేరే భాష,రాష్ట్రం కూడా) పేరుతో,  అదీనూ  వారిద్దరి మధ్య శారీరక సంబంధం తెలిసి కూడా ప్రేమను అంగీకరించకపోవడం ఈ రోజుల్లో అంత ఆమోదయోగ్యం అనిపించలేదు.ఫస్ట్‌ సీన్‌లోనే హీరోని, ‘చిత్తకార్తె’ తీరు తీవ్రతతో చిత్రీకరించి,చివరిలో అతను తన రూముకు వచ్చే సెక్స్‌ వర్కర్స్‌తో కూడా శారీరక సంబంధం పెట్టుకోలేదన్నట్లు చెప్పడం వైరుధ్యంగా కనిపిస్తుంది.తండ్రి, అన్న,స్నేహితులు ఎన్నో సార్లు చెప్పినా మారక, దాదాపు లుంపెన్‌ స్థాయికి చేరిన హీరో, నానమ్మ మరణంతో తండ్రిని ఓదార్చే సందర్భంలో అకస్మాత్తుగా రియలైజ్‌ అవడం నమ్మశక్యంగా లేదు.పెళ్లి అయిన మూడో రోజే ఇంట్లోంచి వచ్చేశానని చెప్పిన హీరోయిన్‌, ఆ పని పెళ్లి కానప్పుడే ఎందుకు చేయలేదనేది కూడా చిన్న ప్రశ్నే.ఇక సెకండాఫ్‌ సినిమా అంతా కథ ఎటు వెళుతున్నదో తెలియనంత సాగదీతగా సాగింది.శారీరక తమకంతో సాగే ప్రేమలో ముద్దు సన్నివేశాలు సహజంగా ఉన్నా, శృతి మించడం మాత్రం కుటుంబం సమేతంగా వచ్చిన వారిని కాస్త ఇబ్బంది  పెడుతుంది.అయితే హీరోయిన్‌ను అర్థనగ్నంగా మూడొంతులు నగ్నంగా చూపడం కన్నా  ప్రేమ సన్నివేశాలలో బోల్డ్‌గా చూపించడం సందర్బానుసారమనుకోవచ్చు. ముగింపు ఊహించినదే అయినా బాగుంది.ఫస్టాఫ్‌ కథనాన్ని, డైలాగులను సహజంగా రాసుకున్న దర్శకుడు కథలో పాయింటును చెప్పడంలో, సెకండాఫ్‌ను నడిపించడంలో మరికొంత స్పష్టతకు వస్తే బాగుండేది. రొమాంటిక్‌ సన్నివేశాలను మిడ్‌, క్లోజ్‌ షాట్లతో అందంగా నడిపించిన కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్‌, సంగీతం కూడా సరిగ్గా కుదిరాయి. కొత్త నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మాణ విలువలు బాగున్నాయి.యూత్‌ ను టార్గెట్‌ చేయడంలో దర్శకుడి గురి తప్పలేదు.

ఎవరెలా చేశారంటే? : బహుముఖ ఛాయలున్న అర్జున్‌ రెడ్డి పాత్రలో విజయ్‌సాయి దేవరకొండ ఒదిగిపోయాడు.పట్టలేని కోపం, ప్రేమ, వ్యసనాలున్న వ్యక్తిగా వేరియేషన్స్‌ చూపించాడు. హీరోయిన్‌ గా ప్రీతి నటన ఆకట్టుకుంటుంది.చివరి సన్నివేశంలో చక్కని వేరియేషన్‌ చూపించింది. సినిమాలో హీరోయిన్‌ కంటే ఎక్కువగా కనపడే హీరో ఫ్రెండ్‌ శివ పాత్రలో రాహుల్‌ రామకృష్ణ బాగా మెప్పించాడు.ఇతర పాత్రల్లో సంజయ్‌ స్వరూప్‌, కళ్యాణ్‌, కమల్‌ కామరాజ్‌ లు పరిధి మేరకు నటించారు.ప్రియదర్శి ఒక పాత్రలో అలా ఒక్కసారి మెరిశాడు. 

బలాలు : కథనం, సహజమైన సన్నివేశాలు,విజయసాయి దేవరకొండ, శాలిని,రోహిత్ రామకృష్ణ నటన
బలహీనతలు : సెకండాఫ్ కథనం,సాగదీత, కథలో పాయింట్, చిన్న లాజిక్ లు మిస్సవడం
ముక్తాయింపు : నేటి తరం యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ

 

SHARE