Sunday January 21, 2018
అది దక్కాలంటే దశాబ్ద కాలం పట్టాల్సిందేనా! - Tollybeats

అది దక్కాలంటే దశాబ్ద కాలం పట్టాల్సిందేనా!

Updated | January 4, 2018 12:56 IST

స్వదేశంలో బీటెక్‌... అమెరికాలో ఎంఎస్‌...ఆ తర్వాత మూడేళ్లపాటు ఓపీటీ... శిక్షణలో ఉండగానే హెచ్‌1బీ వీసాకు దరఖాస్తు. మూడేళ్లపాటు హెచ్‌1బీ వస్తే...మరోమారు మూడేళ్లు పొడిగింపు. అదే సమయంలో పనిచేసే కంపెనీ ఆమోదంతో గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవడం.... అది పెండింగ్‌లో ఉన్నంత కాలం హెచ్‌1బీ వీసా గడువును పొడిగించుకుంటూ ఉండటం... ప్రస్తుతం అమెరికాలోని ఎక్కువ మంది భారతీయ ఉద్యోగులు చేసే పని ఇది.

తెలుగు రాష్ట్రాల యువతా ఇదే దిశగా తన కెరీర్‌ను మలుచుకుంటోంది. అమెరికాలో ఉద్యోగం చేసే భారతీయుల్లో 80 శాతం మంది ఐటీ వారే. నిపుణులు తాత్కాలిక ఉద్యోగం చేసుకునేందుకు ఏటా అమెరికా ప్రభుత్వం 85 వేల హెచ్‌1బీ వీసాలు మంజూరు చేస్తుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్‌లో మొదలవుతోంది. ఆ వీసాల్లో 20 వేలను అమెరికాలో చదువుకున్న వారికి కేటాయిస్తారు. మిగతా వాటిని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులకు ఇస్తారు. మొత్తం వీసాల్లో 70 శాతం భారతీయులకు దక్కుతున్నాయి. ఆరేళ్లపాటు హెచ్‌1బీ వీసాపై ఉంటూ...గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకొని...అది తేలేవరకు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నారు.

అయితే వీసాల పొడిగింపులో హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం(డీహెచ్‌ఎస్‌) సవరణను ప్రతిపాదిస్తోంది. ట్రంప్‌ నినాదానికి అనుగుణంగా వీసాల జారీలో విధాన, నియంత్రణా పరమైన మార్పులను తాము పరిశీలిస్తున్నట్లు అమెరికా పౌరసత్వం, వలసల సేవల సంస్థ (యూఎస్‌ఐఎస్‌) మీడియా సంబంధాల విభాగం అధిపతి జొనాథన్‌ విథింగ్టన్‌ కూడా తెలిపారు. ఆరేళ్ల లోపు గ్రీన్‌కార్డు రాకుంటే ఇక అమెరికాలో ఉద్యోగం చేయడానికి వీల్లేదు. ఈ ప్రతిపాదనే భారతీయ ఉద్యోగుల్లో కల్లోలం రేపుతోంది. గ్రీన్‌కార్డు దక్కితే అక్కడే స్థిరపడవచ్చు. కాకపోతే ఓటు హక్కు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందటం కుదరదు. అవి కూడా దక్కాలంటే సిటిజన్‌షిప్‌ రావాలి.

SHARE